
ఆకాశమే హద్దుగా...
మళ్లీ చెలరేగిన మ్యాక్స్‌వెల్
బెయిలీ మెరుపు ఇన్నింగ్స్
చెన్నైపై పంజాబ్ ఘన విజయం
డు ప్లెసిస్ శ్రమ వృథా
మ్యాక్స్‌వెల్
38 బంతుల్లో 90
6 ఫోర్లు, 8 సిక్స్‌లు
మ్యాక్స్‌వెల్ సునామీకి... బెయిలీ తుపాన్‌కు మధ్య మిల్లర్ మెరుపులు మెరిపించడంతో బారాబతి స్టేడియం పరుగుల వర్షంతో తడిసి ముద్దయింది. ఈ ముగ్గుర్ని అడ్డుకోలేక చెన్నై బౌలర్లు చేష్టలుడిగిపోతే... భారీ లక్ష్యం ముందు బ్యాట్స్‌మెన్ చేతులెత్తేశారు. ఫలితంగా ఐపీఎల్‌లో పంజాబ్ ఆరో విజయాన్ని నమోదు చేసింది.
కటక్: ఐపీఎల్‌లో చెన్నై సూపర్‌కింగ్స్‌ను చూస్తే మిగతా జట్లకు ముచ్చెమటలు పడతాయి. పటిష్టమైన బ్యాటింగ్, బౌలింగ్‌తో పాటు ఆల్‌రౌండర్లకూ జట్టులో కొదువలేదు. అలాంటి ధోనిగ్యాంగ్‌కు పంజాబ్ బ్యాట్స్‌మన్ మ్యాక్స్‌వెల్ (38 బంతుల్లో 90; 6 ఫోర్లు, 8 సిక్సర్లు) వెన్నులో వణుకు పుట్టించాడు.
తనకే సాధ్యమైన ఆటతీరుతో ప్రత్యర్థి బౌలర్లను ఊచకోత కోస్తూ పరుగుల సునామీ సృష్టించాడు. ఫలితంగా బారాబతి స్టేడియంలో బుధవారం జరిగిన ఐపీఎల్-7 లీగ్ మ్యాచ్‌లో పంజాబ్ 44 పరుగుల తేడాతో చెన్నైపై ఘన విజయం సాధించింది. ధోనిసేన టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకోగా... బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్ 20 ఓవర్లలో 4 వికెట్లకు 231 పరుగులు చేసింది.
ఐపీఎల్‌లో ఇది నాలుగో అత్యధిక స్కోరు. మ్యాక్స్‌వెల్‌తో పాటు బెయిలీ (13 బంతుల్లో 40 నాటౌట్; 6 ఫోర్లు, 2 సిక్సర్లు) ఆకాశమే హద్దుగా చెలరేగాడు. మిల్లర్ (32 బంతుల్లో 47; 5 ఫోర్లు, 2 సిక్సర్లు), సెహ్వాగ్ (23 బంతుల్లో 30; 5 ఫోర్లు, 1 సిక్సర్) రాణించారు. మోహిత్ 2, హిల్ఫెన్హాస్, స్మిత్ తలా ఓ వికెట్ పడగొట్టారు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన చెన్నై 20 ఓవర్లలో 6 వికెట్లకు 187 పరుగులు చేసింది. డు ప్లెసిస్ (25 బంతుల్లో 52; 7 ఫోర్లు, 1 సిక్సర్), బి. మెకల్లమ్ (29 బంతుల్లో 33; 3 ఫోర్లు), రైనా (27 బంతుల్లో 35; 3 ఫోర్లు, 1 సిక్సర్), ధోని (20 బంతుల్లో 23; 1 సిక్సర్) పోరాడారు. జాన్సన్‌కు 2 వికెట్లు దక్కాయి. మ్యాక్స్‌వెల్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది.
పరుగుల వరద
పంజాబ్ ఇన్నింగ్స్‌లో తొలి బంతినే బౌండరీకి తరలించిన సెహ్వాగ్ తన మునుపటి ఆటతీరును ప్రదర్శించాడు. నాలుగు ఫోర్లు, ఓ సిక్స్‌తో రెచ్చిపోయాడు. కానీ ఆరు బంతుల వ్యవధిలో మన్‌దీప్ (3), వీరూ అవుటయ్యారు. దీంతో పవర్‌ప్లేలో పంజాబ్ రెండు వికెట్లకు 38 పరుగులు మాత్రమే చేయగలిగింది.
మొదట మ్యాక్స్‌వెల్, మిల్లర్ క్రీజులో నిలదొక్కుకునేందుకు ప్రాధాన్యమిచ్చారు. దీంతో ఏడు నుంచి 10వ ఓవర్ వరకు కేవలం 31 పరుగులు మాత్రమే వచ్చాయి. అప్పటికి మ్యాక్స్‌వెల్ స్కోరు 11 బంతుల్లో 12 పరుగులు మాత్రమే.
11వ ఓవర్ నుంచి మ్యాక్స్‌వెల్ విశ్వరూపం మొదలైంది. అశ్విన్ వేసిన రెండు ఓవర్లలో నాలుగు సిక్స్‌లు, రెండు ఫోర్లు బాదాడు. తర్వాత జడేజా రెండు ఓవర్లలో ఒక ఫోర్ మాత్రమే కొట్టినా... మిల్లర్ రెండు సిక్స్‌లు, ఓ ఫోర్‌తో చెలరేగాడు. పాండే ఓవర్‌లో ఓ సిక్స్, రెండు ఫోర్లు కొట్టిన మ్యాక్స్‌వెల్... స్మిత్ బౌలింగ్‌లో వరుసగా మరో మూడు సిక్సర్లు సంధించాడు. దీంతో ఓవరాల్‌గా 36 బంతుల్లో 104 పరుగులు వచ్చాయి.
మిల్లర్ అవుటైన కొద్దిసేపటికి మ్యాక్స్‌వెల్ మరో ఫోర్ కొట్టి వెనుదిరిగాడు. ఈ ఆసీస్ బ్యాట్స్‌మన్ చివరి 26 బంతుల్లో 78 పరుగులు చేయడం విశేషం. ఈ ద్వయం 64 బంతుల్లో 135 పరుగులు జోడించింది.
ఆఖర్లో బెయిలీ మెరుపు షాట్లతో సూపర్ ఫినిషింగ్ ఇచ్చాడు. వరుస బౌండరీలతో పాటు ఇన్నింగ్స్ చివరి రెండు బంతులను భారీ సిక్సర్లుగా మల్చాడు. బెయిలీ, జాన్సన్ ఐదో వికెట్‌కు 16 బంతుల్లో అజేయంగా 49 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు.
ఆరంభంలోనే తడబాటు...
చెన్నై ఇన్నింగ్స్‌లో స్మిత్ తొలి ఓవర్‌లోనే అవుట్‌కావడంతో మెకల్లమ్ నెమ్మదించాడు. కానీ రైనా మాత్రం వరుస బౌండరీలతో ధాటిగా ఆడేందుకు ప్రయత్నించాడు. ఓ భారీ సిక్సర్‌తో ఊపు తెచ్చినా ఎక్కువసేపు నిలువలేకపోయాడు. మెకల్లమ్, రైనా రెండో వికెట్‌కు 51 పరుగులు జోడించారు.
తర్వాత మెకల్లమ్, జడేజా ఇన్నింగ్స్‌ను కుదుటపర్చే ప్రయత్నం చేసినా వీరిద్దరు అవుట్ కావడంతో చెన్నై మళ్లీ తడబడింది. అప్పటికి జట్టు స్కోరు 98/4.
డు ప్లెసిస్, ధోని భారీ షాట్లకు పోకుండా ఇన్నింగ్స్‌ను నడిపించారు. ఫలితంగా చేయాల్సిన రన్‌రేట్ పెరిగిపోయింది. దీంతో ఓటమి తప్పలేదు.
స్కోరు వివరాలు
కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఇన్నింగ్స్: సెహ్వాగ్ (బి) హిల్ఫెన్హాస్ 30; మన్‌దీప్ (సి) పాండే (బి) మోహిత్ 3; మ్యాక్స్‌వెల్ (సి) జడేజా (బి) మోహిత్ 90; మిల్లర్ (బి) స్మిత్ 47; బెయిలీ నాటౌట్ 40; జాన్సన్ నాటౌట్ 11; ఎక్స్‌ట్రాలు: 10; మొత్తం: (20 ఓవర్లలో 4 వికెట్లకు) 231.
వికెట్ల పతనం: 1-33; 2-38; 3-173; 4-182
బౌలింగ్: హిల్ఫెన్హాస్ 4-0-36-1; ఈశ్వర్ పాండే 4-0-41-0; మోహిత్ శర్మ 4-0-38-2; స్మిత్ 3-0-36-1; జడేజా 3-0-37-0; అశ్విన్ 2-0-38-0
చెన్నై సూపర్‌కింగ్స్ ఇన్నింగ్స్: స్మిత్ (సి) జాన్సన్ (బి) సందీప్ 4; బి. మెకల్లమ్ రనౌట్ 33; రైనా (సి) మిల్లర్ (బి) మ్యాక్స్‌వెల్ 35; జడేజా (బి) ధావన్ 17; డు ప్లెసిస్ (సి) కార్తీక్ (బి) జాన్సన్ 52; ధోని (సి) బెయిలీ (బి) జాన్సన్ 23; మన్హాస్ నాటౌట్ 8; అశ్విన్ నాటౌట్ 11; ఎక్స్‌ట్రాలు: 4; మొత్తం: (20 ఓవర్లలో 6 వికెట్లకు) 187.
వికెట్ల పతనం: 1-5; 2-56; 3-88; 4-98; 5-159; 6-167
బౌలింగ్: సందీప్ 4-0-37-1; జాన్సన్ 4-0-37-2; కార్తీక్ 4-0-40-0; అక్షర్ పటేల్ 4-0-28-0; మ్యాక్స్‌వెల్ 2-0-21-1; రిషి ధావన్ 2-0-23-1.
మ్యాక్స్‌వెల్ విధ్వంసం సాగిందిలా...
1-10 బంతులు: 11 పరుగులు
11-20 బంతులు: 34 పరుగులు
21-30 బంతులు: 33 పరుగులు
31-38 బంతులు: 12 పరుగులు