దిగ్గజాల సరసన రాహుల్
పల్లెకెలె: టీమిండియా ఓపెనర్ కేఎల్ రాహుల్ తన ఫామ్ ను కొనసాగిస్తున్నాడు. శ్రీలంకతో చివరిదైన మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్ లో రాహుల్ (85;135 బంతుల్లో 8 ఫోర్లు) హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. తద్వారా వరుసగా ఏడో హాఫ్ సెంచరీని రాహుల్ తన ఖాతాలో వేసుకున్నాడు. వరుస ఏడు టెస్టుల్లోనూ హాఫ్ సెంచరీలు సాధించిన తొలి భారత క్రికెటర్ గా రాహుల్ గుర్తింపు పొందాడు. అదే సమయంలో ఆ ఘనతను సాధించిన ఆరో క్రికెటర్ గా రాహుల్ నిలిచాడు. అంతకుముందు ఈ ఘనత సాధించిన వారిలో ఎవర్టెన్ వీక్స్(వెస్టిండీస్), ఆండీ ఫ్లవర్(జింబాబ్వే), చందర్పాల్(వెస్టిండీస్), సంగక్కరా( శ్రీలంక), క్రిస్ రోజర్స్(ఆస్ట్రేలి్యా)లు ఉన్నారు.
శ్రీలంకతో మూడు టెస్టుల సిరీస్ లో భాగంగా తొలి టెస్టు మ్యాచ్ కు తీవ్ర జ్వరం కారణంగా రాహుల్ దూరమైన సంగతి తెలిసిందే. ఆపై రెండో టెస్టులో రాహుల్ హాఫ్ సెంచరీ సాధించాడు. తద్వారా వరుసగా ఆరు హాఫ్ సెంచరీలు సాధించిన మూడో భారత ఆటగాడిగా రాహుల్ గుర్తింపు పొందాడు. భారత తరపున వరుసగా ఆరు టెస్టుల్లో అర్ధ శతకాలు చేసిన వారిలో గుండప్ప విశ్వనాథ్, రాహుల్ ద్రవిడ్ లు ఉన్నారు. భారత్ నుంచి వరుసగా ఏడు హాఫ్ సెంచరీలు సాధించిన ఏకైక క్రికెటర్ గా రాహుల్ రికార్డులకెక్కాడు. భారత గడ్డ మీద ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు సిరీస్‌లో రాహుల్ (90, 51, 67, 60, 51 నాటౌట్) వరుసగా ఐదు హాఫ్ సెంచరీలు సాధించాడు. అటు తరువాత శ్రీలంక సిరీస్ రాహుల్ కు మొదటిది. ఇక్కడ కూడా రాహుల్ తన నిలకడను కొనసాగిస్తూ భారత జట్టు విజయాల్లో పాలు పంచుకుంటున్నాడు.