రాహుల్ మరో హాఫ్ సెంచరీ
రాంచీ:ఆస్ట్రేలియాతో తొలి రెండు టెస్టుల్లో ఇప్పటికే మూడు హాఫ్ సెంచరీలు సాధించిన భారత ఓపెనర్ కేఎల్ రాహుల్.. మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్ లో కూడా హాఫ్ సెంచరీ సాధించాడు. 69 బంతుల్లో 8 ఫోర్ల సాయంతో అర్థ శతకం నమోదు చేశాడు. మురళీ విజయ్ తో కలిసి ఇన్నింగ్స్ ఆరంభించిన రాహుల్ కాస్త దూకుడుగా ఆడి హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. అయితే 102 బంతుల్లో 9 ఫోర్లతో 67 పరుగులు చేసిన రాహుల్.. కమిన్స్ బౌలింగ్ లో తొలి వికెట్ గా అవుటయ్యాడు. మరొకవైపు విజయ్ కూల్ గా ఆడుతున్నాడు.
అంతకుముందు ఆసీస్ తన తొలి ఇన్నింగ్స్ లో 451 పరుగులకు ఆలౌటైంది. ఆసీస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్(178 నాటౌట్; 361 బంతుల్లో 17 ఫోర్లు) భారీ సెంచరీ సాధించి అజేయంగా క్రీజ్ లో నిలిచాడు. అతనికి జతగా మ్యాక్స్ వెల్(104;185 బంతుల్లో 9 ఫోర్లు) శతకం సాధించడంతో ఆసీస్ భారీ స్కోరు నమోదు చేసింది.
299/4 ఓవర్ నైట్ స్కోరుతో శుక్రవారం తొలి ఇన్నింగ్స్ ను కొనసాగించిన ఆసీస్ ఆదిలో కుదురుగా ఆడింది. ఓవర్ నైట్ ఆటగాడు మ్యాక్స్ వెల్ తన టెస్టు కెరీర్ లో తొలి సెంచరీని నమోదు చేసుకోగా, కెప్టెన్ స్టీవ్ స్మిత్ మరింత బాధ్యతాయుతంగా ఆడాడు. ఈ జోడి 191 పరుగుల ఐదో వికెట్ భాగస్వామ్యాన్ని సాధించిన తరువాత మ్యాక్స్ వెల్ పెవిలియన్ చేరాడు. ఆపై వికెట్ కీపర్ వేడ్ తో కలిసి స్మిత్ ఇన్నింగ్స్ ను ముందుకు తీసుకెళ్లాడు.వీరు 64 పరుగుల జోడించి తరువాత వేడ్(37;50 బంతుల్లో 6 ఫోర్లు) ఆరో వికెట్ గా పెవిలియన్ కు వెళ్లాడు. జడేజా బౌలింగ్ లో సాహాకు క్యాచ్ ఇచ్చిన వేడ్ అవుటయ్యాడు.
అయితే అదే ఓవర్ లో కమిన్స్ ను డకౌట్ గా జడేజా అవుట్ చేయడంతో ఆసీస్ 395 పరుగుల వద్ద ఏడో వికెట్ ను నష్టపోయింది. దాంతో రెండో రోజు లంచ్ సమయానికి ఆస్టేలియా ఏడు వికెట్ల నష్టానికి 401 పరుగులు చేసింది. తొలి సెషన్ తరువాత ఓకీఫ్ నిలకడగా బ్యాటింగ్ చేశాడు. 71 బంతులు ఎదుర్కొని 5 ఫోర్ల సాయంతో 25 పరుగులు చేశాడు. అయితే ఉమేశ్ యాదవ్ బౌలింగ్ లో భారీ షాట్ కు యత్నించిన ఓకీఫ్ పెవిలియన్ చేరాడు. ఆ తరువాత లియాన్(1)ను జడేజా పెవిలియన్ కు పంపాడు. ఆసీస్ చివరి ఆటగాడు హజల్ వుడ్ (0) రనౌట్ గా అవుటయ్యాడు.