
కేఎల్ రాహుల్
మెరుపు షాట్లు... వీర విజృంభణ... తుఫాన్ ఇన్నింగ్స్ వంటి వర్ణనల కలబోతతో... కేఎల్ రాహుల్ విరుచుకు పడిన వేళ... ఢిల్లీ డేర్ డేవిల్స్‌ను బోల్తా కొట్టించి పంజాబ్ కింగ్స్ ఎలెవన్ గెలుపు బోణి కొట్టింది. విధ్వంసకర ఆటతో పదకొండేళ్ల ఐపీఎల్ చరిత్రలో వేగవంతమైన (14 బంతుల్లో) అర్ధ శతకం నమోదు చేసిన రాహుల్ ఇన్నింగ్స్‌కు... కరుణ్ నాయర్ సమయోచిత ఆట తోడవడంతో కింగ్స్ ఎలెవన్ గెలుపు దిశగా అలవోకగా సాగిపోయింది. వీరిద్దరి దూకుడు ముందు లక్ష్యం చిన్నబోగా గంభీర్ సేన చేసేదేమీ లేకపోయింది.
మొహాలీ: కొత్త కెప్టెన్ అశ్విన్ సారథ్యంలో సొంతగడ్డపై కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ శుభారంభం చేసింది. ఓపెనర్ కేఎల్ రాహుల్ (16 బంతుల్లో 51; 6 ఫోర్లు, 4 సిక్స్‌లు) ఆకాశమే హద్దుగా చెలరేగడంతో ఆదివారం ఇక్కడ జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ డేర్ డెవిల్స్‌ను 6 వికెట్లతో ఓడించింది. కీలక సమయంలో కరుణ్ నాయర్ (33 బంతుల్లో 50; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) బ్యాట్ ఝళిపించడంతో ప్రత్యర్థి విసిరిన లక్ష్యాన్ని మరో 7 బంతులు ఉండగానే అందుకుంది. అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 166 పరుగులు చేసింది. కెప్టెన్ గంభీర్ (42 బంతుల్లో 55; 5 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ శతకం సాధించాడు. పంజాబ్ బౌలర్లలో మోహిత్ శర్మ (2/33), ముజిబుర్ రహమాన్ (2/28) రాణించగా, అశ్విన్ (1/23) పొదుపుగా బౌలింగ్ చేశాడు. రాహుల్‌కే ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది.
ధనాధన్ ఇన్నింగ్స్...
లక్ష్యం... 167. ప్రత్యర్థి జట్టులో బౌల్ట్, షమీ, అమిత్ మిశ్రా వంటి బౌలర్లు ఉన్నా రాహుల్ ఎదుట అంతా తేలిపోయారు. బౌల్ట్ వేసిన తొలి ఓవర్‌లోనే అతడు 16 పరుగులు బాదేశాడు. 2వ (షమీ) ఓవర్లో 11, 3వ (మిశ్రా) ఓవర్లో 24 పరుగులతో 14 బంతుల్లోనే అర్ధ శతకం అందుకున్నాడు. ఈ క్రమంలో యూసుఫ్ పఠాన్ (15 బంతుల్లో 2015 సన్‌రైజర్స్‌పై) పేరిట ఉన్న ఐపీఎల్ ఫాస్టెస్ట్ ఫిఫ్టీ రికార్డును రాహుల్ బద్దలు కొట్టాడు. మూడు ఓవర్ల అనంతరం పంజాబ్ స్కోరు 52 కాగా... అందులో రాహుల్‌వే 51 పరుగులు కావడం తానెంతగా వీర విహారం చేశాడో చెబుతోంది.
ఈ జోరు చూస్తే పంజాబ్ 10 ఓవర్లలోనే మ్యాచ్‌ను ముగించేస్తుందా? అనిపించింది. అయితే రాహు ల్‌తో పాటు మరో ఓపెనర్ మయాంక్ అగర్వాల్ (7)ను వరుస ఓవర్లలోఅవుట్ చేసి ఢిల్లీ బౌలర్లు పరువు దక్కించుకున్నారు. వన్‌డౌన్‌లో వచ్చిన యువరాజ్ సింగ్(12) తడబడుతున్నా... కరుణ్ నాయర్ స్వేచ్ఛగా ఆడటంతో పంజాబ్ ఎక్కడా ఇబ్బంది పడలేదు. లక్ష్యానికి 25 పరుగుల దూరంలో నాయర్ అవుటైనా.. మిల్లర్ (24 నాటౌట్), స్టొయినిస్ (22 నాటౌట్) మిగతా పని పూర్తి చేశారు.
ముజిబుర్ రికార్డు
ఈ మ్యాచ్‌తో అఫ్గానిస్తాన్‌కు చెందిన స్పిన్నర్ ముజిబుర్ రహమాన్ (17 ఏళ్ల 11 రోజులు) ఐపీఎల్ టోర్నీలో బరిలో దిగిన పిన్న వయస్కుడిగా రికార్డు నెలకొల్పాడు. ఇంతకుముందు ఈ రికార్డు సర్ఫరాజ్ ఖాన్ (17 ఏళ్ల 277 రోజలు) పేరిట ఉండేది.
సంక్షిప్త స్కోర్లు
ఢిల్లీ డేర్‌డెవిల్స్: 166/7 (20 ఓవర్లలో) (గంభీర్ 55, రిషభ్ పంత్ 28, మోరిస్ నాటౌట్ 27; అశ్విన్ 1/23, మోహిత్ శర్మ 2/33, ముజిబుర్ 2/28), పంజాబ్ కింగ్స్ ఎలెవన్: 167/4 (18.5 ఓవర్లలో) (కేఎల్ రాహుల్ 51, కరుణ్ నాయర్ 50, మిల్లర్ నాటౌట్ 24, స్టొయినిస్ నాటౌట్ 22; బౌల్ట్ 1/34, మోరిస్ 1/25, క్రిస్టియాన్ 1/12, తేవటియా 1/24).
Comments
Please login to add a commentAdd a comment