
ముంబై: గతేడాది వన్డే ప్రపంచకప్ మెగా టోర్నీలో సెమీఫైనల్ పరాజయం తనను ఇంకా వెంటాడుతోందని భారత స్టార్ బ్యాట్స్‌మన్ కేఎల్ రాహుల్ చెప్పాడు. సెమీస్‌లో న్యూజిలాండ్ చేతిలో ఓటమిని టీమిండియా ఇంకా మర్చిపోలేదని రాహుల్ అన్నాడు. ఏదైనా ఒక మ్యాచ్ ఫలితాన్ని మార్చే శక్తి గనక తనకు లభిస్తే కచ్చితంగా వరల్డ్‌కప్ సెమీస్ మ్యాచ్ ఫలితాన్నే తిరగ రాస్తానని రాహుల్ పేర్కొన్నాడు. ‘మాలో ఎవరూ కూడా ఆ మ్యాచ్ మిగిల్చిన బాధను ఇంకా మరచిపోలేదు. అది ఇంకా మమ్మల్ని వెంటాడుతోంది.
టోర్నీ ఆసాంతం మేం మెరుగ్గా రాణించాం. చివరిమెట్టుపై బోల్తాపడ్డాం. చాలా బాధాకరం. ఒక్కోసారి ఈ పీడకలతో నేను నిద్రలేస్తుంటా’ అని రాహుల్ నాటి ఓటమిని తల్చుకున్నాడు. కోవిడ్–19 కారణంగా అనూహ్యంగా లభించిన ఈ విరామ సమయాన్ని ఆస్వాదిస్తు న్నానని రాహుల్ చెప్పాడు. ‘లాక్‌డౌన్‌ను ప్రశాంతంగా గడుపుతున్నా. కాసేపు ఇంటిపనులు చేస్తున్నా. మరికాసేపు పాత ప్రదర్శనల వీడియోలు చూస్తూ నోట్స్ తయారు చేసుకుంటున్నా. వీటి ద్వారా నేను ఇంకా ఏ అంశాల్లో మెరుగవ్వాలో తెలుసుకుంటున్నా’ అని రాహుల్ అన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment