ఇంగ్లండ్ కు ధీటుగా టీమిండియా బ్యాటింగ్
చెన్నై: ఇంగ్లండ్ తో జరుగుతున్న చివరి టెస్టులో భారత ఓపెనర్ కేఎల్ రాహుల్ (199;310 బంతుల్లో 16 ఫోర్లు, 3 సిక్సర్లు) తృటిలో డబుల్ సెంచరీ సాధించే అవకాశాన్ని కోల్పోయాడు. రాహుల్, పార్థీవ్ పటేల్(71: 112 బంతుల్లో 7 ఫోర్లు), కరుణ్ నాయర్(71 నాటౌట్; 136 బంతుల్లో 6 ఫోర్లు) రాణించడంతో భారత్ పటిష్టస్థితిలో నిలిచింది. మూడో రోజు ఆట నిలిపివేసే సమయానికి టీమిండియా 4 వికెట్లు కోల్పోయి 391 పరుగులు చేసింది. కరుణ్ నాయర్ తో పాటు మురళీ విజయ్ 17 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. ఇంగ్లండ్ బౌలర్లలో బ్రాడ్, రషీద్, మోయిన్ అలీ, స్టోక్స్ తలో వికెట్ తీశారు.
ఓవర్ నైట్ స్కోరు 60 తో బ్యాటింగ్ ప్రారంభించిన టీమిండియా ఓపెనర్లు సెంచరీ భాగస్వామ్యాన్ని నెలకొల్పి ఇన్నింగ్స్ కు గట్టి పునాది వేశారు. పార్థీవ్(71) ఔటయ్యాక క్రీజులోకి వచ్చిన పుజారాను స్టోక్స్ పెవిలియన్ బాట పట్టించాడు. కెప్టెన్ విరాట్ కోహ్లీ(15) స్టూవర్ట్ బ్రాడ్ బౌలింగ్ లో ఇంగ్లండ్ కెప్టెన్ కుక్ కు క్యాచ్ ఇచ్చి మూడో వికెట్ గా వెనుదిరిగాడు. మరో ఆరు ఓవర్లలో మూడో ఆట ముగస్తుందనగా రషీద్ వేసిన బంతిని రాహుల్ ఆడి బట్లర్ పట్టిన ఈజీ క్యాచ్ తో ఒక్క పరుగు తేడాతో డబుల్ సెంచరీ కోల్పోయి నిరాశగా వెనుదిరిగాడు.
అప్పుడు అజహర్.. ఇప్పుడు రాహుల్!
టీమిండియా మాజీ కెప్టెన్ మహ్మద్ అజారుద్దీన్ తర్వాత 199 పరుగుల వద్ద అవుటైన రెండో భారత బ్యాట్స్ మన్ గా రాహుల్ నిలిచాడు. రాహుల్ ఔటైన తర్వాత క్రీజులోకి వచ్చిన విజయ్ త్వరగానే క్రీజులో కుదురుకున్నాడు. భారత్ నాలుగు వికెట్లు కోల్పోయి 391 పరుగులు చేసి మరో 86 పరుగులు వెనకబడి ఉంది. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ లో 477 పరుగులకు ఆలౌటైంది.