ఇక మార్కెట్లోకి ఫాల్కన్ బ్లేడ్ బ్యాట్లు
ముంబై ఐఐటీ విద్యార్థుల సృష్టి
ముంబై: క్రికెట్‌లో ఇక నవతరం బ్యాట్లు రానున్నాయి. విదేశీ పర్యటనల్లో భారత ఆటగాళ్లు బంతిని ఎడ్జ్ చేయబోయి వికెట్ కీపర్ చేతుల్లో, స్లిప్ ఫీల్డర్లకు క్యాచ్‌లు ఇవ్వడం పరిపాటిగా మారింది. ఈ సమస్యకు ఆధునిక రీతిలో పరిష్కారం కనుగొనేందుకు ముంబైలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ)కి చెందిన విద్యార్థులు నడుం బిగించారు. బ్యాట్ల చివర్ల (ఎడ్జ్)ను పునర్‌నిర్మాణం చేయాలని భావించారు. తమ ఆలోచనలకు పదును పెట్టి ఐసీసీ సూత్రాలను అనుసరించి ‘ఫాల్కన్ బ్లేడ్’ పేరిట కొత్త తరహా బ్యాట్లను తయారుచేశారు.
బంతి బ్యాట్ చివరన తాకగానే అది పక్కకు వెళ్లి ఫీల్డర్ల చేతిలో పడకుండా నేరుగా కింది వైపునకు వెళ్లేటట్లు బ్యాట్ స్వరూపాన్ని మార్చారు. పక్క నుంచి చూస్తే విమానం రెక్క మాదిరిగా ఈ బ్యాట్ నిర్మాణం ఉంటుంది. ఈ డిజైన్‌ను మెరిల్‌బోన్ క్రికెట్ క్లబ్ (ఎంసీసీ) కూడా ఆమోదించింది. వచ్చే ఏడాది ఈ బ్యాట్ మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది. ఇవి చాలా తేలిగ్గా ఉండడమే కాకుండా గాల్లో వేగంగా కదులుతాయి. పక్క నుంచి చూస్తే బ్యాట్ మధ్య భాగం సంప్రదాయ బ్యాట్‌కన్నా కాస్త ఎక్కువగా ఉబ్బినట్టు ఉండి కింద షార్ప్‌గా ఉంటుంది.