జట్టుకు అతడు నిజంగా ఓ వరం: కోహ్లి
గాలే: సొంతగడ్డపై గత టెస్టు సీజన్‌లో అద్భుత విజయాలు సాధించిన టీమిండియా రేపు (బుధవారం) శ్రీలంక గడ్డపై గాలే టెస్టుతో కొత్త సీజన్‌ను ప్రారంభించనుంది. ఈ సందర్భంగా మంగళవారం కెప్టెన్ విరాట్ కోహ్లి మీడియాతో మాట్లాడాడు. 'ఆల్ రౌండర్లకు జట్టులో ఎప్పుడూ చోటుంటుంది. అదనపు ఆల్ రౌండర్ బ్యాట్స్ మెన్ ఉంటే జట్టుపై ఒత్తిడి తగ్గుతుంది. హార్దిక్ పాండ్యా లాంటి ఆటగాడు జట్టుకు నిజంగానే ఓ వరం. పరుగులు చేయడంతో పాటు కీలక సమయాల్లో వికెట్లు తీస్తాడు. దీంతో ప్రత్యర్ధి జట్టుపై సులువుగా ఒత్తిడి పెంచవచ్చు. ప్రతి కెప్టెన్ హార్దిక్ లాంటి ఆటగాళ్లు జట్టులో ఉండాలని కోరుకుంటాడు.
చివరగా 2015లో గాలేలో జరిగిన తొలి టెస్టులో అనూహ్యంగా ఓడినా ఆ వెంటనే పుంజుకుని 2-1తో సిరీస్ చేజిక్కుంచుకున్నాం. ప్రస్తుతం జట్టులో సమతూకం ఏర్పడింది. టాపార్డర్ తో పాటు మిడిలార్డర్ ఆటగాళ్లు కూడా రాణిస్తుండటం కలిసొచ్చే అంశం. ప్రత్యర్థి లంకపైనే ఒత్తిడి ఉందని భావిస్తున్నాను. ఓపెనర్ల విషయంపై కాస్త ఆలోచించి నిర్ణయం తీసుకుంటాం. నూతనోత్సాహంతో లంక పర్యటనకు వచ్చాం. విజయాలతో తిరిగివెళ్తామన్న నమ్మకం ఉందని' కోహ్లి ధీమా వ్యక్తం చేశాడు.