
లండన్: భారత్-ఇంగ్లండ్ మధ్య జరిగిన ఓ టెస్టు సిరీస్‌లో భాగంగా అనుష్క శర్మ అంశాన్ని టార్గెట్ చేసి విరాట్ కోహ్లిని స్లెడ్జింగ్ చేయాలని భావించినట్లు ఆనాటి ఇంగ్లండ్ బ్యాట్స్‌మన్ నిక్ కాంప్టన్ వెల్లడించాడు. పోడ్‌క్యాస్ వేదికగా లైవ్ సెషన్‌లో పాల్గొన్న కాంప్టన్ 2012లో భారత పర్యటనకు సంబంధించి పలు ఆసక్తికర విషయాలను అభిమానులతో పంచుకున్నాడు. అనుష్క శర్మతో తను మాట్లాడటం కోహ్లికి అస్సలు నచ్చేది కాదని కాంప్టన్ తాజాగా పేర్కొన్నాడు. (‘ఐదేళ్లలో కింగ్ కోహ్లి స్థానం అతడిదే’)
‘ఓ రోజు సాయంత్రం సహచర ఆటగాళ్లు కెవిన్ పీటర్సన్, యువరాజ్ సింగ్, కోహ్లి, నేను మరికొంతమంది అలా సరదాగా బయటకు వెళ్లాం. కోహ్లి ప్రియురాలు కూడా మా తోనే ఉంది. అప్పుడు ఆమెతో మాట్లాడే ప్రయత్నం చేశాను. అనుష్క నాతో బాగానే మాట్లాడింది. ఇద్దరం అనేక విషయాల గురించి మాట్లాడుకున్నాం. అయితే మేమిద్దం మాట్లాడుకోవడం కోహ్లికి నచ్చలేదు. అందుకే ఆ సిరీస్‌లో నేను బ్యాటింగ్‌కు వచ్చిన ప్రతీసారి అనుష్క నా గర్ల్ ఫ్రెండ్ అని చెప్పే ప్రయత్నం చేశాడు. (విరుష్కల పెళ్లి క్యారికేచర్ వైరల్)
అయితే అప్పటికే కోహ్లి నా బాయ్‌ఫ్రెండ్ అని అనుష్క చెప్పారు. ఇదే విషయాన్ని టార్గెట్ చేసి స్లెడ్జ్ చేసి అతడి ఏకాగ్రతను దెబ్బతీయాలనుకున్నాం. కానీ మా వ్యూహం విఫలం అయింది. నాగ్‌పూర్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో సెంచరీతో రెచ్చిపోయాడు. అయితే ఇప్పటికీ ఆ ఘటనను గుర్తుచేసుకుంటే సరదాగా అనిపిస్తుంటుంది’ అని కాంప్టన్ తెలిపాడు. 2012లో జరిగిన నాలుగు టెస్టుల సిరీస్‌లో భారత్ 1-2 తేడాతో ఓటమిపాలైంది. స్వదేశంలో 1984-85 తర్వాత ఇంగ్లండ్‌పై టెస్టు సిరీస్ ఓడిపోవడం అదే తొలిసారి కావడం గమనార్హం. ఇక నిక్ కాంప్టన్ అరంగేట్రం చేసిన ఆ సిరీస్‌లో 208 పరుగులతో ఫర్వాలేదనిపించాడు.
Comments
Please login to add a commentAdd a comment