కోహ్లి కెప్టెన్సీలోనే... | Kohli to captain India, Clarke fit to lead Australia in 1st Test | Sakshi
Sakshi News home page

కోహ్లి కెప్టెన్సీలోనే...

Published Tue, Dec 9 2014 1:34 AM | Last Updated on Sat, Sep 2 2017 5:50 PM

కోహ్లి కెప్టెన్సీలోనే...

కోహ్లి కెప్టెన్సీలోనే...

ఎట్టకేలకు విరాట్ కోహ్లి కల సాకారం కాబోతోంది. టెస్టుల్లో తొలిసారి ఈ స్టార్ క్రికెటర్ భారత్‌కు సారథ్యం వహించబోతున్నాడు. గాయం నుంచి కోలుకున్నా మరింత విశ్రాంతి కావాలని ధోని భావించడంతో అడిలైడ్ మ్యాచ్‌కు దూరమయ్యాడు. దీంతో కోహ్లికి మార్గం సుగమమైంది. మరోవైపు ఆస్ట్రేలియా కెప్టెన్ మైకేల్ క్లార్క్ కోలుకుని తొలి టెస్టులో ఆడుతున్నాడు.
 
నేటి నుంచి తొలి టెస్టు
- దూకుడే ఆసీస్ మంత్రం
- తమదీ అదే బాటన్న భారత్
- బరిలోకి దిగుతున్న క్లార్క్

అడిలైడ్: టెస్టు సిరీస్ కోసం భారత జట్టు ఆస్ట్రేలియా గడ్డపై అడుగుపెట్టి రెండు వారాలైంది. రెండు ప్రాక్టీస్ మ్యాచ్‌లు ఆడినా, హ్యూస్ మరణం వల్ల ఏర్పడిన పరిస్థితుల విషయంలో చాలా అనిశ్చితి ఏర్పడింది. ఎట్టకేలకు అంతా ముగిసి భారత్ ఓ పెద్ద మ్యాచ్ ఆడేందుకు సిద్ధమైంది. ధోని ఆడతాడా? లేదా? అనే విషయంలో ఏర్పడిన సందిగ్ధ్దతను భారత జట్టు తొలగించింది. ‘నేనే తొలి టెస్టులో జట్టుకు సారథ్యం వహిస్తున్నాను’ అని సోమవారం కోహ్లి ప్రకటించాడు. 2011-12లో చివరిసారిగా భారత జట్టు ఆస్ట్రేలియాలో టెస్టు సిరీస్ ఆడి ఘోరంగా ఓడిపోయింది.

ఆ సిరీస్‌లో సచిన్, లక్ష్మణ్, ద్రవిడ్ లాంటి దిగ్గజాలు జట్టులో ఉన్నారు. అయినా పరాభవం తప్పలేదు. ఈసారి జట్టు మొత్తం కొత్తగా, పూర్తిగా యువకులతో ఉంది. మరి వీళ్లు భారత్ రాతను మారుస్తారా? ఆస్ట్రేలియా గడ్డపై అందని ద్రాక్షగా ఉన్న సిరీస్ విజయం ఘనతను సాధిస్తారా? మంగళవారం నుంచి జరిగే తొలి టెస్టులో దీనికి చాలా వరకు సమాధానం తెలిసిపోతుంది.
 
ఇద్దరిదీ అదే మాట
హ్యూస్ మరణం తర్వాత భావోద్వేగాల నడుమ జరుగుతున్న మ్యాచ్ ఇది. అయితే ఆట విషయానికొస్తే అది ప్రభావం చూపదని ఇరు జట్లూ చెబుతున్నాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ దూకుడు తగ్గించబోమని ఆస్ట్రేలియా అంటుంటే... తమది అదే దారని భారత్ చెబుతోంది. బౌన్సర్ల వర్షం కురిపిస్తానంటూ జాన్సన్ భారత బ్యాట్స్‌మెన్‌ను హెచ్చరిస్తే... మా దగ్గరా బౌన్సర్లు వేసే వాళ్లు ఉన్నారని కోహ్లి సమాధానం ఇచ్చాడు.

ఇక కెప్టెన్‌గా ధోని వన్డేల్లో చాలా దూకుడుగా వ్యవహరించినా... టెస్టుల్లో ఆత్మరక్షణతో వ్యవహరిస్తాడని అతనిపై విమర్శలు ఉన్నాయి. కోహ్లి బాగా దూకుడుగా ఉంటాడని పేరు. కాబట్టి భవిష్యత్‌లో టెస్టు కెప్టెన్‌గా ధోని స్థానంలో కోహ్లిని ఎంపిక చేయాలా వద్దా అనే అంశాన్ని కూడా ఈ టెస్టు ద్వారా పరిశీలించవచ్చు.
 
ధోని మినహా అంతా ఫిట్
భారత శిబిరంలో ధోని మినహా అందరూ ఫిట్‌నెస్‌తో ఉన్నారని కోహ్లి చెబుతున్నాడు. భువనేశ్వర్ కాలి నొప్పి తగ్గిందని, తను తొలి టెస్టు సెలక్షన్‌కు అందుబాటులో ఉంటాడని కెప్టెన్ తెలిపాడు. అయితే టీమ్ మేనేజ్‌మెంట్ బయటకు అలా చెబుతున్నా... భువనేశ్వర్ గాయం తగ్గలేదని, తను తొలి రెండు టెస్టులకు అందుబాటులో ఉండటం కష్టమని వార్తలు వస్తున్నాయి. మరోవైపు ఆస్ట్రేలియా తమ తుది జట్టును ప్రకటించింది. కెప్టెన్ క్లార్క్ పూర్తి ఫిట్‌నెస్‌తో ఉన్నాడని, అతను బరిలోకి దిగుతుండటంతో తమ స్థైర్యం మరింత పెరుగుతుందని జాన్సన్ చెప్పాడు.
 
‘భారత్‌కు టెస్టు ఆడటం అనేది నా కల. ఈ రోజు టెస్టు జట్టుకు సారథ్యం వహించబోతున్నాను. వ్యక్తిగతంగా ఇది నాకు చాలా గొప్ప విషయం. వన్డేల్లో సారథ్యం వహించిన అనుభవం ఇప్పుడు ఉపకరిస్తుంది. జట్టులోని ఆటగాళ్లందరి సంపూర్ణ సహకారం ఉంటుంది. నా నిర్ణయాలను గౌరవిస్తారు. కానీ కెప్టెన్సీ కంటే బాగా ఆడటం ముఖ్యం. మొత్తం 11 మంది ప్రణాళికలకు తగ్గట్టుగా ఆడితేనే గెలుస్తాం. నా కెరీర్‌లో ఎప్పుడూ దూకుడుగానే ఉన్నాను. టెస్టు కెప్టెన్‌గానూ అదే కొనసాగిస్తాను. మైదానంలో ప్రత్యర్థికి ఆటతోనైనా, నోటితోనైనా దీటుగా బదులివ్వాలి.

అలా చేయడం వల్ల నేను ఆటపై మరింత దృష్టిపెట్టగలుగుతా. ఆస్ట్రేలియాలో గత పర్యటన ద్వారా ఇక్కడ ఎలా ఆడాలో తెలుసుకున్నా. బౌన్సర్ల గురించి ప్రత్యేకంగా మాట్లాడాల్సిందేమీ లేదు. అది ఆటలో భాగం. ఇంగ్లండ్ సిరీస్‌లో ఏం జరిగింది, ఎలా ఆడాననేది ఇప్పుడు అనవసరం. ఈ సిరీస్‌లో బాగా ఆడటం ముఖ్యం. ఏం జరిగినా మరచిపోయి ముందుకు సాగడం ముఖ్యం. హ్యూస్ మరణం కలచివేసినా ఇక ఆటపై దృష్టి పెట్టడం ముఖ్యం.’                              
- కోహ్లి (భారత్ కెప్టెన్)
 
 
‘మేం ఎప్పటిలాగే దూకుడుగానే ఆడతాం. బౌన్సర్లు వేయడానికి వెనుకాడం. గత 18 నెలలుగా నేను బాగా బౌలింగ్ చేస్తున్నాను. హ్యూస్‌ను స్మరించుకుని మ్యాచ్ మొదలుపెట్టడం భావోద్వేగాలతో కూడిన విషయం. కానీ ఒకసారి మ్యాచ్ మొదలైతే ఆట మీదే పూర్తి దృష్టి. మానసికంగా కూడా మేం మ్యాచ్ కోసం పూర్తిగా సన్నద్ధమయ్యాం. క్లార్క్ పూర్తిగా కోలుకుని బరిలోకి దిగుతుండటం మా స్థైర్యాన్ని పెంచుతుంది.’          
-జాన్సన్ (ఆస్ట్రేలియా పేసర్)
 
32-భారత్‌కు టెస్టుల్లో సారథ్యం వహిస్తున్న 32వ క్రికెటర్ కోహ్లి

 
పిచ్
ఆస్ట్రేలియాలోని చాలా పిచ్‌ల తరహాలోనే పేసర్లకు అనుకూలం. అయితే స్పోర్టింగ్ పిచ్ తయారు చేశామని క్యురేటర్ డామియన్ చెబుతున్నారు. ఆరంభంలో పేసర్లకు, మధ్యలో రెండు రోజులు బ్యాట్స్‌మెన్‌కు, చివరి రోజు స్పిన్నర్లకు సహకరిస్తుందని ఆయన తెలిపారు.
 
13వ ఆటగాడు హ్యూస్
సాధారణంగా మ్యాచ్ కోసం తుది జట్టును ప్రకటించాక 12వ ఆటగాడిగా ఒక పేరును ప్రకటిస్తారు. తొలి టెస్టు కోసం ఆస్ట్రేలియా 13 మందిని ప్రకటించింది. 13వ ఆటగాడిగా ఇటీవల మరణించిన హ్యూస్‌ను గౌరవిస్తున్నారు. అతని టెస్టు క్యాప్ నంబర్ 408ని షర్ట్‌ల మీద ధరిస్తారు. అలాగే క్రికెట్ ఆస్ట్రేలియా మ్యాచ్ ఆరంభానికి ముందు హ్యూస్‌కు నివాళిగా ఒక వీడియో ప్రదర్శించనుంది.
 
డీఆర్‌ఎస్ లేదు

భారత్, ఆస్ట్రేలియా సిరీస్‌లో అంపైర్ నిర్ణయ సమీక్ష పద్ధతి (డీఆర్‌ఎస్) ఉండటం లేదు. సాధారణంగా ఆస్ట్రేలియాలో జరిగే అన్ని సిరీస్‌లకూ ఈ పద్ధతిని వాడతారు. కానీ మొదట్నించి బీసీసీఐ దీనిని విశ్వసించడం లేదు. సిరీస్‌లో ఇరు జట్లూ అంగీకరిస్తేనే డీఆర్‌ఎస్‌ను వాడాలనే నిబంధన ఉంది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement