విరాట్ ప్రత్యేకత ఇదే..
న్యూఢిల్లీ: టీమిండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీపై న్యూజిలాండ్ సారథి కేన్ విలియమ్సన్ ప్రశంసల వర్షం కురిపించాడు. మూడు ఫార్మాట్లలోనూ డామినేట్ చేయగల సత్తా కోహ్లీకి ఉందని, ఇదే అతని ప్రత్యేకత అని విలియమ్సన్ కితాబిచ్చాడు. భారత్లో జరిగే మూడు టెస్టుల సిరీస్ కోసం న్యూజిలాండ్ జట్టుతో కలసి ఇక్కడికి వచ్చిన విలియమ్సన్ మంగళవారం మీడియాతో మాట్లాడాడు.
'విరాట్ గొప్ప ఆటగాడు. మూడు ఫార్మాట్లలోనూ అతను అద్భుతాలు చేయగలడు. అతని ఆటను చూడటానికి ఇష్టపడతా. భారత జట్టులో కోహ్లీ సహా చాలామంది ఉత్తమ ఆటగాళ్లున్నారు. వారిని కట్టడి చేయడంపై మేం దృష్టిసారించాల్సి వుంది' అని కివీస్ కెప్టెన్ అన్నాడు. ఐపీఎల్లో విలియమ్సన్ సన్ రైజర్స్ హైదరాబాద్కు ప్రాతినిధ్యం వహించాడు. భారత్ గడ్డపై క్రికెట్ ఆడటం గురించి మాట్లాడుతూ.. ఇక్కడి పిచ్లపై ఆడటం సవాల్తో కూడుకున్నదని అన్నాడు. ముఖ్యంగా టెస్టుల్లో టీమిండియాను వారి సొంతగడ్డపై ఎదుర్కోవడం సవాలేనని, పరిస్థితులు వారికి అనుకూలంగా ఉంటాయని చెప్పాడు. కాగా ఐపీఎల్లో ఆడిన ఆటగాళ్లు చాలామంది తమజట్టులో ఉన్నారని, ఇక్కడి పిచ్లపై ఆడిన అనుభవం తమకు ఉపయోగపడుతుందని విలియమ్సన్ అన్నాడు.