గౌతమ్‌ కృష్ణప్ప.. నమ్మలేకపోయానప్పా | Krishnappa Gowtham Innings In RRvMI Still Cant Believe Says Ajinkya Rahane | Sakshi
Sakshi News home page

గౌతమ్‌ కృష్ణప్ప.. నమ్మలేకపోయానప్పా: రహానే

Published Mon, Apr 23 2018 9:46 AM | Last Updated on Mon, Apr 23 2018 3:11 PM

Krishnappa Gowtham Innings In RRvMI Still Cant Believe Says Ajinkya Rahane - Sakshi

రాజస్తాన్‌ ఆటగాడు కృష్ణప్ప గౌతమ్‌

జైపూర్‌: ‘ఆఖరి పంచ్‌ మనదైతే ఆ కిక్కే వేరప్పా’ అంటున్నాడు గౌతమ్‌ కృష్ణప్ప! ఐపీఎల్‌ 2018లో భాగంగా ఆదివారం ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో స్టన్నింగ్‌ ఇన్నింగ్స్‌(11 బంతుల్లో 33 పరుగులు(2 సిక్సర్లు, 4 ఫోర్లు) ఆడి రాజస్తాన్‌ రాయల్స్‌ను గెలిపించిన గౌతమ్‌పై సర్వత్రా ప్రశంసలవర్షం కురుస్తోంది. గతేడాది ముంబై ఇండిన్స్‌కు(రూ.2కోట్లు) ఆడిన ఈ ఆల్‌రౌండర్‌ను ఈ దఫా రాజస్తాన్‌ రాయల్స్‌ రూ.6.2కోట్లకు సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.

నమ్మలేకపోయా!: ‘జస్ట్‌ బిలీవ్‌ దట్‌ యు కెన్‌’ అన్న కెప్టెన్‌ రహానే మాటలే తనకు బలమిచ్చాయని, కనీసం ఆఖరి బంతికైనా ఖచ్చితంగా గెలుస్తామనే నమ్మకంతోనే ఆడానని కృష్ణప్ప గౌతమ్‌ చెప్పాడు. విచిత్రమేమంటే.. ఏ మాటచెప్పి గౌతమ్‌ను ప్రేరేపించాడో.. సరిగ్గా దానికి విరుద్ధంగా స్పందించాడు కెప్టెన్‌ రహానే. మ్యాచ్‌ అనంతరం మాట్లాడిన రాయల్స్‌ సారధి.. ‘ఏం జరిగిందో ఇప్పటికీ నమ్మలేకపోతున్నా..’ అని అన్నాడు! జట్టు విజయంలో కృష్ణప్ప బాదుడుకు తోడు బౌలర్ల సంయమనం కూడా ఉందని పేర్కొన్నాడు. ‘‘ముంబై టీమ్‌ 180-190 పరుగులు చేస్తుందనుకున్నా. కానీ మిడిల్‌, స్లాగ్‌ ఓవర్లలో మా వాళ్లు అద్భుతంగా బౌలింగ్‌ చేశారు. అసలు ఎలా గెలిచామో, ఏం జరిగిందో ఇప్పటికీ నమ్మలేకపోతున్నా..’ అని అజింక్యా వ్యాఖ్యానించాడు.

సంజూ శాంసన్‌ ఆసక్తికర వ్యాఖ్యలు: ఈ సీజన్‌లో అద్భుతంగా రాణిస్తోన్న సంజూ శాంసన్‌.. ఆదివారం ముంబైతో జరిగిన మ్యాచ్‌లోనూ విలువైన ఇన్నింగ్స్‌ 52(39 బంతులు, 4 ఫోర్లు) ఆడాడు. అన్ని మ్యాచ్‌లు కలిపి 239 పరుగులు సాధించిన శాంసన్‌.. ‘ఆరెంజ్‌ క్యాప్‌’  దక్కించుకున్నాడు. ‘మ్యాచ్‌లో ఎన్ని పరుగులు చేశామన్నది లెక్కకాదు. జట్టును గెలిపించామా లేదా అన్నదే కీలకం. నేను ఆరెంజ్‌ క్యాప్‌ తీసుకొని.. మా జట్టు ఓడిపోయి ఉంటే అస్సలు సంతోషించేవాడిని కాదు. థ్యాంక్స్‌ టు కృష్ణప్ప గౌతమ్‌(11 బంతుల్లో 33 పరుగులు)’’ అని సంజూ పేర్కొన్నాడు.

ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో రాజస్తాన్‌ రాయల్స్‌.. ముంబై ఇండియన్స్‌పై మూడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. సంజూ శాంసన్‌(52), బెన్‌స్టోక్స్‌ (40), కృష్ణప్ప గౌతమ్‌(33) పరుగులు చేశారు. ముంబై బౌలర్లో పాండ్యా, బుమ్రాలు చెరో రెండు వికెట్లు దక్కాయి. మెక్లెనగన్‌, క్రునాల్‌, ముస్తాఫిజుర్‌లు తలో వికెట్‌ నేలకూల్చారు. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 167 పరుగులు చేసింది. ఓపెనర్‌ సూర్యకుమార్‌ యాదవ్‌(72), ఇషాన్‌ కిషన్‌ (58), పొలార్డ్‌(21)లు రాణించారు. రాజస్తాన్‌ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్‌కు 3, ధవల్‌ కులకర్ణికి 2, ఉనద్కత్‌కు ఒక్క వికెట్‌ లభించాయి. అద్భుత బౌలింగ్‌తో ఆకట్టుకున్న జోఫ్రా ఆర్చర్‌(4 ఓవర్లు 22 పరుగులకు 3 వికెట్లు)కు మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు దక్కింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement