కృనాల్ విశ్వరూపం
► 37 బంతుల్లో 86
► బౌలింగ్‌లోనూ మెరుపులు
► ఢిల్లీపై ముంబై ఘనవిజయం
సాక్షి, విశాఖపట్టణం: కచ్చితంగా నెగ్గి తీరాల్సిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ జూలు విదిల్చింది. యువ ఆల్‌రౌండర్ కృనాల్ పాండ ్య (37 బంతుల్లో 86; 7 ఫోర్లు; 6 సిక్సర్లు) విధ్వంసకర ఇన్నింగ్స్‌కు తోడు బౌలింగ్‌లోనూ రాణించడంతో ఆదివారం ఢిల్లీ డేర్‌డెవిల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై 80 పరుగుల తేడాతో నెగ్గింది. తద్వారా రోహిత్ సేన మూడో స్థానానికి చేరింది. ఇక గుజరాత్‌తో జరిగే తమ చివరి మ్యాచ్‌లోనూ ముంబై నెగ్గాల్సి ఉంది. అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ముంబై 20 ఓవర్లలో నాలుగు వికెట్లకు 206 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఓపెనర్‌గా గప్టిల్ (42 బంతుల్లో 48; 2 ఫోర్లు; 3 సిక్సర్లు) రాకతో ముంబైకి శుభారంభం అందింది. తొలి ఓవర్‌లో వరుసగా ఫోర్, సిక్సర్‌తో రోహిత్ (21 బంతుల్లో 31; 1 ఫోర్; 3 సిక్సర్లు) జోరును కనబరిచాడు. ఆ తర్వాత నాలుగో ఓవర్‌లో ఓపెనర్లిద్దరూ చెరో సిక్స్ బాదడంతో పవర్‌ప్లేలో ముంబై 45 పరుగులు సాధించింది.
అయితే మిశ్రా బౌలింగ్‌లో రిషబ్ పంత్ మెరుపు క్యాచ్‌తో రోహిత్ పెవిలియన్‌కు చేరాడు. దీంతో తొలి వికెట్‌కు 46 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. ఆ తర్వాత గప్టిల్‌కు జత కలిసిన కృనాల్ పాండ్య స్వేచ్ఛగా బ్యాట్ ఝుళిపించాడు. స్పిన్నర్లు మిశ్రా, తాహిర్‌లను లక్ష్యంగా చేసుకుని బౌండరీలు రాబట్టాడు. దీంతో 10 ఓవర్లలో స్కోరు 84/1కి చేరగా.. 13వ ఓవర్ నుంచి రాకెట్ వేగంతో దూసుకెళ్లింది. తాహిర్ వేసిన ఈ ఓవర్‌లో గప్టిల్ రెండు సిక్సర్లు.. పాండ్య ఓ సిక్స్, ఫోర్ బాదడంతో 23 పరుగులు వచ్చాయి. ఆ తర్వాతి ఓవర్‌లోనే భారీ సిక్స్ బాదిన పాండ్య 22 బంతుల్లో ఐపీఎల్‌లో తన తొలి అర్ధ సెంచరీ సాధించాడు. అయితే మోరిస్ ఒకే ఓవర్‌లో పాండ్య, పొలార్డ్‌ను అవుట్ చేశాడు. చివర్లో రాయుడు (5 బంతుల్లో 13 నాటౌట్; 1 ఫోర్; 1 సిక్స్), బట్లర్ (9 బంతుల్లో 18 నాటౌట్; 2 ఫోర్లు; 1 సిక్స్) మెరుపులతో స్కోరు 200 దాటింది.
అనంతరం బరిలోకి దిగిన ఢిల్లీ బ్యాట్స్‌మెన్ తేలిపోవడంతో 19.1 ఓవర్లలో 126 పరుగులు చేసి ఓడింది. డి కాక్ (28 బంతుల్లో 40; 4 ఫోర్లు; 2 సిక్సర్లు) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. టాప్ ఆర్డర్ పేలవ ప్రదర్శన ఢిల్లీని కష్టాల్లోకి నెట్టింది. అటు పదో ఓవర్‌లో డి కాక్ వికెట్‌ను కృనాల్ తీయడంతో జట్టుకు గట్టి దెబ్బ తగిలింది. ఆ తర్వాత రిషబ్ పంత్ (17 బంతుల్లో 23; 2 ఫోర్లు; 1 సిక్స్) స్కోరును పెంచే ప్రయత్నం చేశాడు. కానీ డుమిని (9), రిషబ్ పంత్‌ను బుమ్రా వరుస బంతుల్లో అవుట్ చేయడంతో జట్టు కోలుకోలేకపోయింది.
స్కోరు వివరాలు
ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్: రోహిత్ శర్మ (సి) రిషబ్ (బి) మిశ్రా 31; గప్టిల్ (సి) నాయర్ (బి) జహీర్ 48; కృనాల్ (బి) మోరిస్ 86; పొలార్డ్ (సి) డి కాక్ (బి) మోరిస్ 3; బట్లర్ నాటౌట్ 18; రాయుడు నాటౌట్ 13; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం (20 ఓవర్లలో 4 వికెట్లకు) 206.
వికెట్ల పతనం: 1-46, 2-144, 3-173, 4-174.
బౌలింగ్: నదీమ్ 4-0-42-0; మోరిస్ 4-0-34-2; జహీర్ 4-0-23-1; మిశ్రా 4-0-42-1; తాహిర్ 4-0-59-0.
ఢిల్లీ డేర్‌డెవిల్స్ ఇన్నింగ్స్: మయాంక్ (బి) వినయ్ 8; డి కాక్ (సి) బట్లర్ (బి) కృనాల్ 40; కరుణ్ నాయర్ (సి) బుమ్రా (బి) హర్భజన్ 8; శామ్సన్ (రనౌట్) 6; రిషబ్ (బి) బుమ్రా 23; డుమిని (సి) బట్లర్ (బి) బుమ్రా 9; మోరిస్ (రనౌట్) 20; మిశ్రా (బి) బుమ్రా 1; నదీమ్ నాటౌట్ 1; తాహిర్ (రనౌట్) 5; జహీర్ (బి) పాండ్య 2; ఎక్స్‌ట్రాలు 3; మొత్తం (19.1 ఓవర్లలో ఆలౌట్) 126.
వికెట్ల పతనం: 1-11, 2-46, 3-60, 4-71, 5-96, 6-96, 7-109, 8-118, 9-123, 10-126.
బౌలింగ్: హర్భజన్ 4-0-34-1; వినయ్ 4-0-33-1; మెక్లీనగన్ 4-0-26-0; బుమ్రా 4-0-13-3; కృనాల్ 2.1-0-15-2; రాణా 1-0-3-0.