
ప్రతీ సమస్యకు పరిష్కారం ధోని దగ్గర ఉంటుంది
లండన్: ఎంఎస్ ధోని కేరాఫ్ మిస్టర్ కూల్ కెప్టెన్, మ్యాచ్ ఫినిషర్, ఫాస్టెస్ట్ వికెట్ కీపర్. స్వదేశం, విదేశం అన్న తేడా లేకుండా ఫ్యాన్స్‌ను సంపాదించుకున్నాడు. బ్యాట్స్‌మన్‌గా అవతలి ఎండ్ బ్యాట్స్‌మన్‌కు సూచనలు ఇవ్వగలడు, వికెట్ కీపర్‌గా బౌలర్లకు సలహాలు ఇవ్వగలడు, ఫీల్డర్లను సరైన ప్రదేశంలో మోహరించగలడు. మొత్తంగా చెప్పాలంటే కెప్టెన్, కోచ్ కన్నా ఎక్కువ అతడు. తన అనుభవాన్నంతా ఉపయోగించి జూనియర్లకు పాఠాలు నేర్పిస్తూ వారి గెలుపుకు సహకరిస్తున్నాడు. అందుకే ధోని.. ఓ ట్రంప్ కార్డు అన్నాడు పాక్ మాజీ క్రికెటర్ జహీర్ అబ్బాస్. తాజాగా స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ ధోనిని ప్రశంసలతో ఆకాశానికి ఎత్తేశాడు.
‘ధోని వద్ద ఏ సమస్యకైనా పరిష్కారం దొరుకుతుంది. ఎక్కడ బంతులు వేయాలో అర్థం కాక ఇబ్బంది పడితే ఒకసారి ధోని వైపు చూస్తే చాలు.. నా సమస్యను అర్థం చేసుకొని ఎలా బంతులు వేయాలో చెప్తాడు. ఏ బాల్ వేస్తే ఏ బ్యాట్స్‌మన్ ఏ షాట్ కొడతాడు అన్నది కచ్చితంగా చెప్పగలడు. ధోని వికెట్ల వెనక ఉంటే కొండంత ధైర్యం’ అని కుల్దీప్ పేర్కొన్నాడు. తాను మాత్రమే కాదని జట్టులోని బౌలర్లంతా ధోని వైపే చూస్తారని తెలిపాడు. టీమిండియా సారథి విరాట్ కోహ్లి ఆటగాళ్లకు ధైర్యాన్ని ఇస్తాడని.. ధోని ఆటగాళ్లకు అత్యంత స్వేచ్చనిస్తాడని కుల్దీప్ వివరించాడు. ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్ మైండ్‌లో ఏముందో ధోని ముందే పసిగట్టగలడని ప్రశంసించాడు. ఇక ప్రపంచకప్‌లో భాగంగా నేడు బంగ్లాదేశ్‌తో టీమిండియా వార్మప్ మ్యాచ్ ఆడనుంది. తొలి వార్మప్ మ్యాచ్‌లో న్యూజిలాండ్ చేతిలో అనూహ్యంగా ఓటమి చెందిన కోహ్లిసేన తప్పులు దిద్దుకుని పోరాడలని భావిస్తోంది.