
లండన్: టీమిండియా మాజీ సారథి, సీనియర్ ఆటగాడు ఎంఎస్ ధోని తాజా ప్రపంచకప్‌లో తన ప్రదర్శనతో మరోసారి విమర్శల పాలవుతున్నాడు. ప్రపంచకప్‌లో భాగంగా అఫ్గానిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ధోని జిడ్డుగా బ్యాటింగ్ చేయడంతో టీమిండియా స్వల్ప స్కోర్‌కే పరిమితమైంది. అయితే ఓటమి చివరంచుదాక వెళ్లిన కోహ్లి సేనను పేసర్లు మహ్మద్ షమీ, జస్ప్రిత్ బుమ్రా అద్భుత ప్రదర్శనతో కాపాడారు. అయితే కేదార్ జాదవ్, ధోనిల స్లో బ్యాటింగ్ టీమిండియాను ఇబ్బందులకు గురిచేసిందని విమర్శకులు మండిపడుతున్నారు.
ఇక క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ కూడా ధోని బ్యాటింగ్ తీరుపై విమర్శలు ఎక్కుపెట్టాడు. అయితే తాజాగా మాజీ సారథి సౌరవ్ గంగూలీ మాత్రం ధోనికి మద్దతుగా నిలిచాడు. ‘అఫ్గాన్ మ్యాచ్‌లో వైఫల్యం చెందినంత మాత్రానా ధోనిని విమర్శించాల్సిన అవసరం లేదు. ధోని విఫలమైంది ఒక్క మ్యాచ్‌లోనే అని గుర్తుంచుకోవాలి. మిగిలిన మ్యాచ్‌ల్లో అతడి సత్తా ఏంటో నిరూపించుకుంటాడు. ప్రపంచకప్ ముగిసే సరికి అతడే టీమిండియా హీరో అవుతాడు. నా సారథ్యంలోనే ధోని అరంగేట్రం చేశాడు. అప్పట్నుంచి అతడి ఆటను పరిశీలిస్తున్నాను’అంటూ గంగూలీ పేర్కొన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment