
మెండిస్ రికార్డు సెంచరీ.. కోలుకున్న శ్రీలంక
పల్లెకెలె (శ్రీలంక): ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టులో శ్రీలంక ఆటగాడు కుశాల్ మెండిస్ రికార్డు సెంచరీ సాధించాడు. ఆసీస్ స్పిన్నర్ లియాన్ బౌలింగ్ లో, 43వ ఓవర్ చివరి బంతిని సిక్స్ బాది కెరీర్ లో తొలి శతకాన్ని నమోదుచేశాడు. అతిపిన్న వయసులో టెస్ట్ సెంచరీ నమోదుచేసిన తొలి లంక ఆటగాడిగా అరుదైన ఫీట్ నెలకొల్పాడు. 21 ఏళ్ల 177రోజుల వయసులో కుశాల్ సెంచరీ చేయగా, గతంలో కలువితరణ (22 ఏళ్ల 267 రోజులు) పేరిట ఉన్న రికార్డు బద్దలైంది. తొలి టెస్టులో 117 పరుగులకే కుప్పకూలిన లంక, మెండిస్ రాణించడంతో రెండో ఇన్నింగ్స్ లో 48 ఓవర్లలో లంక 4 వికెట్లకు 159 పరుగులు చేసింది. ఆసీస్ బౌలర్లలో స్టార్క్ రెండు వికెట్లు పడగొట్టాడు. కెఫె, లియాన్ చెరో వికెట్ తీశారు.
ప్రస్తుతం లంక 73 పరుగుల ఆధిక్యంలో ఉంది. మెండిస్(156 బంతుల్లో 115; 16 ఫోర్లు, 1 సిక్స్) కు తోడుగా చండిమల్(21 నాటౌట్) క్రీజులో ఉన్నాడు. అంతకుముందు ఆసీస్ తమ తొలి ఇన్నింగ్స్ లో 203 పరుగులకు ఆలౌటైంది. వోజెస్ (115 బంతుల్లో 47; 3 ఫోర్లు) రాణించగా మార్ష్ 31, స్మిత్ 30, ఖాజా 26 పరుగులు చేశారు.