భారీ బడ్జెట్ 'సినిమాలు' | lasr year IPL winner Mumbai Indians history | Sakshi
Sakshi News home page

భారీ బడ్జెట్ 'సినిమాలు'

Published Fri, Apr 3 2015 2:32 AM | Last Updated on Sat, Sep 2 2017 11:45 PM

భారీ బడ్జెట్ 'సినిమాలు'

భారీ బడ్జెట్ 'సినిమాలు'

ఐపీఎల్ ఏడు సీజన్లలో కలిపి ముంబై ఇండియన్స్ మొత్తం 110 మ్యాచ్‌లు ఆడింది. ఇందులో ఆ జట్టు 63 మ్యాచ్‌లలో గెలిచి, 47 ఓడింది.ఏ కారణం వల్ల కూడాఆ జట్టుకు సంబంధించిన ఒక్క మ్యాచ్ కూడా రద్దు కాకపోవడం విశేషం.
 
 ముంబై ఇండియన్స్... అన్నింటా అట్టహాసం
 జట్టులో ఒకరిని మించిన స్టార్ మరొకరు... భారీ చెల్లింపులు... టీమ్ ముఖచిత్రంగా సచిన్. ప్రపంచంలో ఏ మూల ఏ కొత్త క్రికెటర్ మెరుపు ఇన్నింగ్స్ ఆడినా...  పొలార్డ్, లెవీ, అండర్సన్ ఎవరైనా కావచ్చు... తర్వాతి సీజన్‌లో ఈ జట్టులోకి రావాల్సిందే. ఇక పెద్ద సంఖ్యలో సహాయక సిబ్బంది. అందరూ దిగ్గజాలే. బాలీవుడ్ తారలంతా ఈ జట్టుకే మద్దతుగా మెరుస్తారు... ఇలా ఐపీఎల్ ముంబై ఇండియన్స్ జట్టు ఒక భారీ బడ్జెట్ సినిమాను తలపిస్తుంది. తొలి ఐదు సీజన్లలో నిరాశ ఎదురైనా... ఆరోసీజన్‌లో టైటిల్ గెలిచి జెండా ఎగరవేసింది. ఇప్పుడు మరో భారీ బృందంతో ఐపీఎల్-8కి సిద్ధమైంది. మరి అంబానీ జట్టు ఈసారి టైటిల్ గెలుస్తుందా..!
 
 సాక్షి క్రీడా విభాగం :  ఐపీఎల్ తొలి సీజన్‌లో గాయం కారణంగా సచిన్ సగం మ్యాచ్‌లు ఆడలేకపోయాడు. ఆ తర్వాత అతను కోలుకొని బరిలోకి దిగినా, జయసూర్యలాంటి విధ్వంసకర ఆటగాడు ఉన్నా...ముంబై ఇండియన్స్ తడబడింది. 14 మ్యాచ్‌లలో 7 మాత్రమే గెలిచి ఐదో స్థానంతో సరిపెట్టుకుంది. సచిన్-జయసూర్య ఓపెనింగ్ భాగస్వామ్యం మాత్రం కాస్త ఆసక్తి రేకెత్తించింది. తర్వాతి సీజన్‌లో పరిస్థితి మరింత దిగజారింది. ఈసారి ఐదే విజయాలు దక్కడంతో ఏకంగా ఏడో స్థానానికి ముంబై పడిపోయింది. దక్షిణాఫ్రికాలో జరిగిన ఈ టోర్నీ ముంబైకి ఏ రకంగానూ కలిసి రాలేదు. ఐపీఎల్-3తో మాత్రం ఆ జట్టు అదృష్టం మారింది. 16 మ్యాచ్‌లలో 11 గెలిచి జట్టు సెమీ ఫైనల్లోకి ప్రవేశించింది.
 
  తొలి సారి జట్టులోకి వచ్చిన పొలార్డ్ ఆల్‌రౌండ్ నైపుణ్యంతో బెంగళూరుపై నెగ్గి ఫైనల్‌కు చేరిన జట్టు... తుది పోరులో చెన్నైకి తలవంచింది. 2011లో ముంబై తమ హోమ్ ప్లేయర్ రోహిత్ శర్మను వేలంలో సొంతం చేసుకుంది. 16 మ్యాచ్‌లలో 10 గెలిచి ప్లే ఆఫ్‌కు అర్హత సాధించింది. చివరకు మూడో స్థానంతో సరిపెట్టుకుంది. ఈ టోర్నీలోనే సచిన్ సెంచరీ సాధించడం విశేషం. మరుసటి ఏడాది అప్పుడే సంచలన సెంచరీతో గుర్తింపు తెచ్చుకున్న రిచర్డ్ లెవీని తెచ్చుకున్నా...అది పెద్దగా కలిసి రాలేదు. టోర్నీ ఆరంభానికి కాస్త ముందు సచిన్ అనూహ్యంగా కెప్టెన్సీనుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించడంతో హర్భజన్‌సింగ్‌కు బాధ్యతలు అప్పగించారు.
 
 ఈ సారి కూడా 10 విజయాలతో ప్లే ఆఫ్‌కు చేరినా నాలుగో స్థానమే దక్కింది. ఎట్టకేలకు ఐదు సీజన్ల అనంతరం ముంబై అభిమానుల కోరిక తీరింది. ఎలాగైనా టోర్నీ గెలవాలని ఆ జట్టు భారీ ప్రణాళికలు రూపొందించింది. అంతర్జాతీయ కెరీర్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన రికీ పాంటింగ్‌ను జట్టు కెప్టెన్‌గా నియమించింది. కుంబ్లే చీఫ్ మెంటార్‌గా, రోడ్స్ ఫీల్డింగ్ కోచ్‌గా వచ్చాడు. ఆల్‌టైమ్ దిగ్గజాలు సచిన్, పాంటింగ్ కలిసి ఓపెనింగ్ చేయడం అభిమానులను అలరించింది.
 
  అయితే పాంటింగ్ బ్యాట్స్‌మన్‌గా పెద్దగా ప్రభావం చూపలేకపోవడంతో అతడిని తుది జట్టునుంచి తప్పించి రోహిత్ శర్మను కెప్టెన్‌గా ఎంపిక చేశారు. తెర వెనుక మాత్రం పాంటింగ్ వ్యూహాలు పని చేశాయి. అంతే...ముంబై ఒక్కసారిగా ఊపందుకుంది. ఫలితంగా 11 విజయాలతో ప్లే ఆఫ్‌కు క్వాలిఫై అయింది. రెండో క్వాలిఫయర్‌లో రాజస్థాన్‌ను ఓడించి ఫైనల్‌కు చేరింది. అనంతరం కోల్‌కతాలో జరిగిన ఫైనల్లో 23 పరుగులతో చెన్నైని ఓడించి తొలి సారి ఐపీఎల్ చాంపియన్‌గా నిలిచింది. అదే ఏడాది చాంపియన్స్ లీగ్ విజేత కూడా కావడం ముంబై ఇండియన్స్ ఆనందాన్ని రెట్టింపు చేసింది.
 
 నాలుగో స్థానంతో సరి
 2014 ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ ఫర్వాలేదనే ప్రదర్శన కనబర్చింది. 14 మ్యాచ్‌లలో 7 గెలిచి, 7 ఓడింది. ప్లే ఆఫ్‌కు అర్హత సాధించినా, ఎలిమినేటర్‌లో ఓటమిపాలై నాలుగో స్థానంలో నిలిచింది. కోరి తెచ్చుకున్న కోరీ అండర్సన్ అందరికంటే ఎక్కువ స్ట్రైక్‌రేట్‌తో బాగానే ఆడాడు. సిమన్స్ ఒక సెంచరీ సహా అత్యధిక పరుగులతో (394) టీమ్ టాపర్‌గా నిల వగా... రోహిత్(390) రాణించాడు.
 
 కొత్తగా జట్టులోకి...
 ఈ సారి ఆరోన్ ఫించ్, ఉన్ముక్త్ చంద్, వినయ్‌కుమార్, పార్థివ్ పటేల్, మిథున్, మెక్లీన్‌గన్‌లను  కొత్తగా జట్టులోకి చేర్చుకుంది.  వెటరన్లు మైక్ హస్సీ, జహీర్‌ఖాన్‌లను వదులుకుంది. ఓజా, బ్లిజార్డ్‌లను వదిలేసినా తిరిగి వేలంలో సొంతం చేసుకుంది. కీలక ఆటగాళ్లు: ముంబై ఇండియన్స్ అట్టి పెట్టుకున్న రోహిత్ శర్మ, పొలార్డ్, మలింగ, రాయుడు, హర్భజన్‌లే మరోసారి జట్టు బాధ్యతను మోయనున్నారు. వీరితో పాటు  కోరీ అండర్సన్, లెండిల్ సిమన్స్‌లు కూడా కీలక పాత్ర పోషించగలరు. 26 మంది సభ్యులతో ఈ సారి కూడా పెద్ద జట్టుతోనే ఐపీఎల్-8 బరిలోకి దిగుతోంది.
 
 టీమ్ యజమాని    :రిలయన్స్ ఇండస్ట్రీస్ (నీతా అంబాని)
 కెప్టెన్    :రోహిత్ శర్మ
 
 సహాయక సిబ్బంది :పాంటింగ్ (హెడ్ కోచ్),  రాబిన్ సింగ్ (అసిస్టెంట్ కోచ్),
 షేన్ బాండ్ (బౌలింగ్ కోచ్), రోడ్స్ (ఫీల్డింగ్ కోచ్),
 సచిన్ (మెంటార్), కుంబ్లే (చీఫ్ మెంటార్).

 
 గతంలో ఉత్తమ  ప్రదర్శన    :    విజేత (2013), రన్నరప్ (2010)
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement