
రో‘హిట్’తో ముంబై విన్‌డియన్స్
► కోల్‌కతాపై రెండో విజయం
► రోహిత్ వీరోచిత ఇన్నింగ్స్
► గంభీర్ శ్రమ వృథా
మళ్లీ ఆ ఇద్దరే... అప్పుడు కోల్‌కతాలో... ఇప్పుడు వాంఖడేలో... కానీ ఫలితం మాత్రం మారలేదు. రెండుసార్లూ ముంబై ఇండియన్స్‌నే విజయం వరించింది. ఈ సీజన్ ఆరంభంలో కోల్‌కతాలో ముంబైతో జరిగిన మ్యాచ్‌లో గంభీర్ చెలరేగి భారీ లక్ష్యాన్ని నిర్దేశిస్తే... రోహిత్ వీరోచిత ఇన్నింగ్స్‌తో ఛేదించేశాడు. మళ్లీ అదే సీన్ ఇప్పుడు వాంఖడేలోనూ పునరావృతమైంది.
ముంబై: ప్రతీకార పోరులో కోల్‌కతాకు మళ్లీ పరాజయమే ఎదురైంది. భారీ లక్ష్యం నిర్దేశించినా పేలవమైన బౌలింగ్‌తో... రోహిత్ శర్మ (49 బంతుల్లో 68 నాటౌట్; 8 ఫోర్లు, 2 సిక్సర్లు), పొలార్డ్ (17 బంతుల్లో 51 నాటౌట్; 2 ఫోర్లు, 6 సిక్సర్లు) భారీ హిట్టింగ్‌ను అడ్డుకోలేకపోయింది. దీంతో ఐపీఎల్-9లో గురువారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ 6 వికెట్ల తేడాతో కోల్‌కతా నైట్‌రైడర్స్‌పై గెలిచింది. రోహిత్ శర్మకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.
వాంఖడే స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో... ముంబై టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకోగా, కోల్‌కతా 20 ఓవర్లలో 5 వికెట్లకు 174 పరుగులు చేసింది. కెప్టెన్ గౌతమ్ గంభీర్ (45 బంతుల్లో 59; 6 ఫోర్లు, 1 సిక్స్) మూడో అర్ధసెంచరీతో ఆకట్టుకోగా, రాబిన్ ఉతప్ప (20 బంతుల్లో 36; 1 ఫోర్, 2 సిక్సర్లు) అండగా నిలిచాడు. రెండో ఓవర్‌లో క్యాచ్ అవుట్ నుంచి బయటపడ్డ గౌతీ జోరు చూపెట్టడంతో పవర్‌ప్లేలో కోల్‌కతా 59 పరుగులు చేసింది. తొలి వికెట్‌కు 69 పరుగులు జోడించాక ఉతప్ప వెనుదిరిగాడు. వన్‌డౌన్‌లో షకీబ్ (6) విఫలమైనా... సూర్యకుమార్ యాదవ్ (17 బంతుల్లో 21; 2 ఫోర్లు) నిలకడగా ఆడాడు. 13వ ఓవర్‌లో వరుసగా సిక్స్, ఫోర్ బాదిన కెప్టెన్ 39 బంతుల్లో అర్ధసెంచరీ సాధించాడు. సూర్యకుమార్‌తో కలిసి మూడో వికెట్‌కు 44 పరుగులు జోడించి అవుటయ్యాడు. చివర్లో రసెల్ (16 బంతుల్లో 22; 3 ఫోర్లు), క్రిస్ లిన్ (10 బంతుల్లో 10 నాటౌట్), యూసుఫ్ పఠాన్ (8 బంతుల్లో 19 నాటౌట్; 4 ఫోర్లు) దుమ్మురేపారు. లిన్, యూసుఫ్ ఆరో వికెట్‌కు అజేయంగా 16 బంతుల్లో 29 పరుగులు జత చేశారు. తొలి 10 ఓవర్లలో 87 పరుగులు చేసిన నైట్‌రైడర్స్ చివరి 10 ఓవర్లలోనూ అన్నే పరుగులు చేసింది. సౌతీ 2 వికెట్లు పడగొట్టాడు.
తర్వాత లక్ష్య ఛేదనకు దిగిన ముంబై 18 ఓవర్లలో 4 వికెట్లకు 178 పరుగులు చేసింది. అంబటి తిరుపతి రాయుడు (20 బంతుల్లో 32; 5 ఫోర్లు, 1 సిక్స్) ఆకట్టుకున్నాడు. ఓపెనర్ పార్థీవ్ పటేల్ (1) తొందరగా అవుటైనా... రోహిత్, రాయుడు ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. నైట్‌రైడర్స్ బౌలర్లపై ఆధిపత్యం చూపెడుతూ భారీ సిక్స్‌లు, బౌండరీల మోత మోగించారు. దీంతో 10కిపైగా రన్‌రేట్ నమోదు కావడంతో పవర్‌ప్లేలో ముంబై స్కోరు 64/1కి చేరింది. అయితే ఏడో ఓవర్‌లో మరో భారీ షాట్‌కు ప్రయత్నించి రాయుడు అవుట్‌కావడంతో రెండో వికెట్‌కు 59 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. ఈ దశలో క్రునాల్ పాండ్యా (6) నిరాశపర్చినా... బట్లర్ (15) వేగంగా ఆడాడు. దీంతో తొలి 10 ఓవర్లలో ముంబై 3 వికెట్లకు 85 పరుగులు చేసింది.
ఈ క్రమంలో రోహిత్ 36 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేసుకోగా, నరైన్ వేసిన 13వ ఓవర్‌లో బౌండరీ లైన్ వద్ద క్రిస్ లిన్ అద్భుతమైన క్యాచ్ అందుకోవడంతో బట్లర్ వెనుదిరిగాడు. ఈ ఇద్దరి మధ్య నాలుగో వికెట్‌కు 28 పరుగులు సమకూరాయి. తర్వాత పొలార్డ్ వచ్చి రావడంతో కోల్‌కతా బౌలర్లపై విరుచుకుపడ్డాడు. రెండో ఎండ్‌లో రోహిత్ కూడా బ్యాట్ ఝుళిపించడంతో స్కోరు బోర్డు కదం తొక్కింది. 16వ ఓవర్‌లో పొలార్డ్ మూడు భారీ సిక్సర్లు సంధించి 23 పరుగులు రాబట్టాడు. 24 బంతుల్లో 26 పరుగులు చేయాల్సిన దశలో రోహిత్ ఓ ఫోర్, పొలార్డ్ మూడు సిక్స్‌లు కొట్టి మరో 12 బంతులు మిగిలి ఉండగానే విజయాన్ని ఖాయం చేశారు.
స్కోరు వివరాలు
కోల్‌కతా నైట్‌రైడర్స్ ఇన్నింగ్స్: ఉతప్ప (సి) పొలార్డ్ (బి) హర్భజన్ 36; గంభీర్ (సి) పొలార్డ్ (బి) మెక్లీనగన్ 59; షకీబ్ (సి) పార్థీవ్ (బి) హార్దిక్ 6; సూర్యకుమార్ (సి అండ్ బి) సౌతీ 21; రసెల్ (బి) సౌతీ 22; క్రిస్ లిన్ నాటౌట్ 10; యూసుఫ్ పఠాన్ నాటౌట్ 19; ఎక్స్‌ట్రాలు 1; మొత్తం: (20 ఓవర్లలో 5 వికెట్లకు) 174.
వికెట్ల పతనం: 1-69; 2-77; 3-121; 4-130; 5-145.
బౌలింగ్: సౌతీ 4-0-38-2; మెక్లీనగన్ 4-0-33-1; బుమ్రా 4-0-34-0; హర్భజన్ 4-0-32-1; హార్దిక్ పాండ్యా 2-0-15-1; క్రునాల్ పాండ్యా 2-0-21-0.
ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్: రోహిత్ నాటౌట్ 68; పార్థీవ్ (సి) యూసుఫ్ (బి) ఉమేశ్ 1; రాయుడు (సి) సూర్యకుమార్ (బి) షకీబ్ 32; క్రునాల్ (బి) నరైన్ 6; బట్లర్ (సి) క్రిస్ లిన్ (బి) నరైన్ 15; పొలార్డ్ నాటౌట్ 51; ఎక్స్‌ట్రాలు 5; మొత్తం: (18 ఓవర్లలో 4 వికెట్లకు) 178.
వికెట్ల పతనం: 1-8; 2-67; 3-78; 4-106.
బౌలింగ్: ఉనాద్కట్ 3-0-49-0; ఉమేశ్ యాదవ్ 2-0-19-1; షకీబ్ 4-0-30-1; నరైన్ 4-0-22-2; సతీష్ 2-0-30-0; రసెల్ 3-0-28-0.