అయ్యో.. ముంబై! | last ball thrillers disappoint Mumbai Indians | Sakshi
Sakshi News home page

అయ్యో.. ముంబై!

Published Sat, Apr 14 2018 8:45 PM | Last Updated on Sat, Apr 14 2018 10:59 PM

last ball thrillers disappoint Mumbai Indians - Sakshi

ముంబై: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌)తాజా సీజన్‌లో ముంబై ఇండియన్స్‌కు మరోసారి నిరాశే మిగిలింది. శనివారం ఢిల్లీ డేర్‌డెవిల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఏడు వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. దాంతో ఆ జట్టు ఆడిన మూడు మ్యాచ్‌ల్లో ఓటమి పాలై పాయింట్ల పట్టికలో అట్టడుగు స్ధానంలో కొనసాగుతోంది. డిఫెండింగ్‌ చాంపియన్‌గా బరిలోకి దిగిన రోహిత్‌ సేనను దురదృష్టం వెంటాడుతోంది. హ్యాట్రిక్‌ పరాజయాల్ని చవిచూసిన ముంబై ఇండియన్స్‌.. కడవరకూ చేస్తున్న పోరాటంలో ఆకట్టుకుంటున్నా విజయాల్ని మాత్రం సాధించలేకపోతోంది. అందులోనూ చివరి ఓవర్‌లో  ఓటముల్ని చవిచూడటం ముంబై ఇండియన్స్‌కు మింగుడు పడటం లేదు. వరుస రెండు మ్యాచ్‌ల్లో ఆఖరి బంతికి పరాజయాల్ని ఎదుర్కోవడం ముంబై శిబిరంలో తీవ్ర నిరాశను మిగిల్చింది.


తాజా మ్యాచ్‌లో ఆఖరి బంతిని జాసన్‌ రాయ్‌ సింగిల్‌ కొట్టి ఢిల్లీ డేర్‌డెవిల్స్‌కు విజయాన్ని అందించాడు. ఢిల్లీకి ఆఖరి ఓవర్‌లో 11 పరుగులు కావాల్సిన సమయంలో ముస్తాఫిజుర్‌ వేసిన తొలి రెండు బంతుల్ని ఫోర్‌, సిక‍్సర్లు కొట్టడంతో స్కోరు సమం అయ్యింది. ఆ తర్వాత ముస్తాఫిజుర్‌ హ్యాట్రిక్‌ డాట్‌ బాల్స్‌ వేయడంతో ఫలితం చివరి బంతి వరకూ వెళ్లింది. అయితే ఆఖరి బంతిని రాయ్‌ సింగిల్‌ తీయడంతో ముంబైకు ఓటమి తప్పలేదు.

అయితే అంతకుముందు సన్‌రైజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కూడా ముంబైది ఇదే పరిస్థితి. చివరి ఓవర్‌లో సన్‌రైజర్స్‌ విజయానికి 11 పరుగులు కావాల్సిన తరుణంలో ముంబై బౌలర్‌ బెన్‌ కట్టింగ్‌ బౌలింగ్‌ అందుకున్నాడు. క్రీజ్‌లో ఉన్న దీపక్‌ హుడా తొలి బంతిని సిక్స్‌ కొట్టగా, ఆ మరుసటి బంతి వైడ్‌ అయ్యింది. దాంతో రెండో బంతి పడకుండానే మరొక పరుగు సన్‌రైజర్స్‌ ఖాతాలో చేరింది. ఆపై వేసిన రెండో బంతి పరుగు రాకపోగా, మూడో బంతికి సింగిల్‌ మాత్రం వచ్చింది. నాల్గో బంతిని స్టాన్‌ లేక్‌ సింగిల్‌ తీయగా, ఐదో బంతిని దీపక్‌ హుడా సింగిల్‌ తీశాడు. దాంతో చివరి బంతికి ప్రాధాన్యత పెరిగింది. హైదరాబాద్‌ ఆటగాడు స్టాన్‌లేక్‌  ఆఖరి బంతిని ఫోర్‌ కొట్టి ముంబైకు విజయాన్ని దూరం చేశాడు.

ఇక ఐపీఎల్‌-11 సీజన్‌ ఆరంభపు మ్యాచ్‌లో భాగంగా చెన్నై సూపర్‌ కింగ్స్‌ తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇంకా బంతి ఉండగా ఓటమి పాలు కావడం గమనార్హం. ముస్తాఫిజుర్‌ వేసిన ఆఖరి ఓవర్‌ నాలుగు, ఐదు బంతుల్లో కేదర్‌ జాదవ్‌ వరుసగా సిక్స్‌, ఫోర్‌ కొట్టడంతో చెన్నై విజయం సాధించగా, ముంబై పరాజయం చవిచూసింది. ఇలా మూడు మ్యాచ్‌ల్లో ముంబైకు గెలుపు ఊరించినట్లే ఊరించి దూరం కావడంతో ఆ జట్టు పరిస్థితిని చూస్తున్న సగటు అభిమాని మాత్రం అయ్యో అనుకుంటున్నాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement