డివిలియర్స్ , విరాట్ కోహ్లి
అయిదు లేదా అంతకంటే ఎక్కువ వన్డేల సిరీస్‌లో దక్షిణాఫ్రికాను వారి సొంతగడ్డపై ఓడించిన రెండో జట్టు భారత్ మాత్రమే....ఈ వన్డే సిరీస్‌లో టీమిండియా సాధించిన ఘనతకు ఇదో నిదర్శనం. మూడు టెస్టులతో పాటు అయిదు వన్డేలు కలిపి ప్రొటీస్ తరఫున నమోదైనది ఒకే ఒక్క సెంచరీ. మన ఆటగాళ్లు చేసినవి అయిదు. ...రెండు జట్ల ప్రదర్శన మధ్య ఉన్న తేడాకు, భారత బ్యాట్స్‌మెన్ జోరుకు ఇదో సాక్ష్యం.ఈ ద్వైపాక్షిక సిరీస్‌లో సఫారీల బ్యాటింగ్ సగటు 22.65. బౌలింగ్ సగటు 50.2. స్వదేశంలో వారికిదే దారుణ ప్రదర్శన....ప్రస్తుతం ప్రత్యర్థిపై భారత్ ఆధిపత్యం ఏ విధంగా ఉందో చెప్పేందుకు ఇదో ఉదాహరణ. ...ఈ నేపథ్యంలో ఇప్పటికే సిరీస్ చేజిక్కించుకున్న కోహ్లి సేన చివరిదైన ఆరో వన్డేకు సమరోత్సాహంతో ఉంది. అన్ని రంగాల్లో బలంగా ఉన్న మన జట్టు మరోసారి దక్షిణాఫ్రికా పని పట్టేందుకు సిద్ధమవుతోంది.
సెంచూరియన్ : భారత్‌కు పాతికేళ్లుగా అందని ద్రాక్షలా ఉన్న సిరీస్ విజయం అయిదో వన్డేతో సాకారమైంది. పనిలో పనిగా రెండు జట్లలో ఐసీసీ వన్డే నంబర్ వన్ ర్యాంక్ ఎవరిదో తేలిపోయింది. అయినా... చివరి మ్యాచ్‌లోనూ గెలిచి ఆధిపత్యాన్ని మరింత బలంగా చాటాలని టీమిండియా భావిస్తోంది. మరోవైపు స్వదేశంలో ఎన్నడూ లేనంతటి పరాభవాన్ని ఎదుర్కొన్న దక్షిణాఫ్రికా పరువు దక్కించుకునేందుకైనా విజయం సాధించాలని ఆశిస్తోంది. తద్వారా గణాంకాల్లో ఓటమి అంతరాన్ని తగ్గించుకుని... మూడు మ్యాచ్‌ల టి20 సిరీస్‌కు ఆత్మవిశ్వాసంతో వెళ్లాలని కోరుకుంటోంది. అయితే... పరిస్థితులన్నీ ఆ జట్టుకు ప్రతికూలంగానే ఉన్నాయి. పైగా ఇదే వేదికపై రెండో వన్డేలో ఘోరంగా ఓడిపోయింది. ఈ సమీకరణాల రీత్యా చూస్తే ప్రత్యర్థిని నిలువరించాలంటే ఆ జట్టు అద్భుత ప్రదర్శన చేయాల్సిందే.
మార్పులతో భారత్!
రిజర్వ్ బెంచ్ బలాన్ని పరీక్షిస్తామని, అయినా పట్టు విడవకుండా ఆడి సిరీస్‌ను 5–1తో ముగించడమే లక్ష్యమని కెప్టెన్ విరాట్ కోహ్లి స్పష్టంగా ప్రకటించాడు. దీనిప్రకారం శుక్రవారం ఆరో వన్డేకు భారత్ మార్పులతో బరిలో దిగే అవకాశం ఉంది. లంక పర్యటన నుంచి మూడు ఫార్మాట్లలోనూ ఆడుతూ అలసిపోయిన పేసర్లు భువనేశ్వర్, బుమ్రాలకు విశ్రాంతినిచ్చి మహ్మద్ షమీ, శార్దూల్ ఠాకూర్‌లను తుది జట్టులోకి తీసుకోవచ్చు. షమీ మూడేళ్లుగా ఆడింది మూడు వన్డేలే. శార్దూల్‌ది రెండు వన్డేల అనుభవమే. ఇద్దరు ప్రధాన పేసర్లను ఒకేసారి తప్పించడం ఇబ్బందని భావిస్తే మాత్రం ఒక్కరినే మార్చే ఆలోచన చేయొచ్చు. కుల్దీప్ స్థానంలో అక్షర్ పటేల్‌ను ఎంచుకోవచ్చు. బ్యాటింగ్‌లో మిడిలార్డర్ నుంచి ఇప్పటివరకు ఒక్కటే అర్ధశతకం (తొలి వన్డేలో రహానే) నమోదైంది. శ్రేయస్ అయ్యర్ మంచి ఆరంభాలను సద్వినియోగం చేసుకోలేకపోయాడు. టాపార్డర్‌లో ఎవరో ఒకరు 35 ఓవర్లపైగా క్రీజులో ఉంటుండటంతో 4–7 స్థానాల మధ్య ఎవరూ రాణించకున్నా ప్రభావం కనిపించలేదు. అయిన్పటికీ భవిష్యత్ అవసరాల దృష్ట్యా జట్టు యాజమాన్యం మిడిలార్డర్‌ను పరీక్షించే యోచనలో ఉంది. ఈ లెక్కల్లో మనీశ్‌పాండే, దినేశ్ కార్తీక్‌లలో ఎవరివైపు మొగ్గుచూపుతారు..? ఇద్దరినీ ఆడిస్తారా...? అన్నది చూడాలి. కోహ్లినే విశ్రాంతి తీసుకుంటాడని ఊహాగానాలు వస్తున్నా ఆచరణలోకి వస్తేగాని వాటిని విశ్వసించలేం.
సఫారీలకు అంతా సవాలే...
వచ్చే నెలలో ఆస్ట్రేలియా సిరీస్‌ను దృష్టిలో పెట్టుకుని టి20 సిరీస్‌కు సఫారీ జట్టు ప్రధాన బౌలింగ్ బలగాన్నంతటికీ విశ్రాంతినిచ్చింది. దీంతో మోర్కెల్, రబడ, ఇన్‌గిడి, తాహిర్‌లు ఈ వన్డేలోనైనా తమ ముద్ర చూపాల్సి ఉంది. ఫామ్‌లో ఉన్న భారత టాపార్డర్‌ను వీరు ఎంత తొందరగా పెవిలియన్‌కు పంపితే ఆ మేరకు జట్టు విజయావకాశాలు పెరుగుతాయి. ఓపెనర్లు కెప్టెన్ మార్క్‌రమ్, ఆపద్బాంధవుడు ఆమ్లా ఫర్వాలేకున్నా... డుమిని, డివిలియర్స్, మిల్లర్ గెలిపించే ఇన్నింగ్స్‌లు ఆడలేకపోతున్నారు. అయిదో వన్డేలో డుమిని, ఏబీ కీలక సమయంలో విఫలమయ్యారు. వీరిలో ఇద్దరైనా భారీ స్కోర్లు చేస్తే చివర్లో మిల్లర్, ఫెలూక్వాయో స్కోరు పెంచేందుకు వీలుంటుంది. సెంచూరియన్ పిచ్ స్పిన్నర్లకు సహకరిస్తుంది కాబట్టి షమ్సీతో పాటు తాహిర్‌నూ ఆడించవచ్చు. పేస్ ఆల్‌రౌండర్ మోరిస్‌ను తీసుకోదలిస్తే గత మ్యాచ్ తుది జట్టులోని ఒకరిని పక్కనపెడతారు.
తుది జట్లు (అంచనా)
భారత్: రోహిత్‌శర్మ, శిఖర్ ధావన్, విరాట్ కోహ్లి (కెప్టెన్), రహానే/మనీశ్‌పాండే, అయ్యర్/దినేశ్ కార్తీక్, ధోని, పాండ్యా, కుల్దీప్/అక్షర్, చహల్, షమీ, బుమ్రా/శార్దూల్.
దక్షిణాఫ్రికా: మార్క్‌రమ్ (కెప్టెన్), ఆమ్లా, డుమిని, డివిలియర్స్, మిల్లర్, క్లాసెన్, ఫెలూక్వాయో/మోరిస్, తాహిర్, షమ్సీ, రబడ, మోర్కెల్.
పిచ్, వాతావరణం
సెంచూరియన్ పిచ్ భారత్‌లోని పిచ్‌ల తరహాలో ఉంటుంది. రెండో వన్డేలో 8 వికెట్లు నేలకూల్చి చహల్, కుల్దీప్ ఆతిథ్య జట్టును 118 పరుగులకే పరిమితం చేసిందిక్కడే. శుక్రవారం వర్షం కురిసే అవకాశం ఉంది. మైదానంలో మంచి డ్రైనేజీ వ్యవస్ధ ఉండటంతో మ్యాచ్‌కు ఎటువంటి ఇబ్బంది తలెత్తకపోవచ్చు.
►సా.గం. 4.30 నుంచి సోనీ–టెన్ 1, 3లలో ప్రత్యక్ష ప్రసారం
Comments
Please login to add a commentAdd a comment