
కొలంబో: శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టులో న్యూజిలాండ్ ఆటగాడు టామ్ లాథమ్ భారీ సెంచరీ సాధించాడు. 251 బంతులు ఎదుర్కొన్న లాథమ్ 15 ఫోర్ల సాయంతో 154 పరుగులు చేశాడు. దాంతో న్యూజిలాండ్ తేరుకోవడమే కాకుండా లంకపై పైచేయి సాధించింది. ఆదివారం 196/4 ఓవర్‌నైట్ స్కోరుతో తొలి ఇన్నింగ్స్‌ను ఆరంభించిన కివీస్‌కు లాథమ్, వాట్లమ్‌లు కీలకమైన భాగస్వామ్యాన్ని సాధించారు. ఈ జోడి ఐదో వికెట్‌కు 145 పరుగుల భాగస్వామ్యాన్ని జత చేశారు. అయితే కివీస్ స్కోరు 269 పరుగుల వద్ద ఉండగా లాథమ్ పెవిలియన్ చేరాడు. అదే సమయంలో వాట్లమ్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.
తొలి ఇన్నింగ్స్‌లో శ్రీలంక 244 పరుగులకు ఆలౌటైన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఇన్నింగ్స్ ఆరంభించిన కివీస్‌కు ఆదిలోనే షాక్ తగిలింది. జీత్ రావల్ డకౌట్‌గా పెవిలియన్ చేరాడు. ఆ తరుణంలో లాథమ్ మాత్రం సమయోచితంగా బ్యాటింగ్ చేశాడు. కేన్ విలియమ్సన్(20), రాస్ టేలర్(23)లు పెవిలియన్ చేరినా లాథమ్ మాత్రం నిలకడగా ఆడాడు. వాట్లమ్ నుంచి చక్కటి సహకారం లభించడంతో లాథమ్ భారీ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఇది లాథమ్‌కు 10వ టెస్టు సెంచరీ.