కోల్‌కతా: కరోనా కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక సంక్షోభం కూడా తలెత్తిన ప్రస్తుత పరిస్థితుల్లో జపాన్ దేశం ఒలింపిక్స్‌ను ఎలా నిర్వహిస్తుందో తనకు అర్థం కావడం లేదని భారత టెన్నిస్ దిగ్గజం లియాండర్ పేస్ వ్యాఖ్యానించాడు. ఒక అగ్రశ్రేణి ఆటగాడికి కరోనా సోకితే పరిస్థితి ఏమిటని అతను ప్రశ్నించాడు. ‘ఒలింపిక్స్‌కు అండగా నిలిచే కార్పొరేట్ స్పాన్సర్లు ఎప్పటిలాగే ముందుకొస్తారా అనేది సందేహమే. ఒకవేళ ప్రేక్షకులు లేకుండా నిర్వహించాల్సి వస్తే పరిస్థితి మరింత దారుణంగా ఉండవచ్చు. మైదానాలు ఖాళీగా ఉంటే ఆదాయం ఎక్కడి నుంచి వస్తుంది.
క్రీడలు కూడా ఒక పెద్ద వ్యాపారమే. నా చేతులకు కూడా పెద్ద మొత్తంలో బీమా ఉంటుంది. అనుమతి లేకుండా నేను టమాటాలు కూడా కోయలేను. ఫుట్‌బాల్ లీగ్‌లు ప్రారంభించారు సరే దురదృష్టవశాత్తూ ఏ రొనాల్డోకో, మెస్సీకో కోవిడ్–19 సోకితే ఏం చేస్తారు. ఆ స్థాయి దిగ్గజ ఆటగాళ్లు ప్రాణాల కోసం ఆస్పత్రిలో పోరాడటాన్ని మనం ఊహించగలమా. ఫుట్‌బాల్ అయినా సరే మ్యాచ్‌లో ఏదో ఒక సమయంలో ఆటగాళ్లు దగ్గరకు వస్తూనే ఉంటారు కదా. ఇలాంటి స్థితిలో క్రీడలు ఎలా సాధ్యం’ అని 1996 అట్లాంటా ఒలింపిక్స్ కాంస్య పతక విజేత అభిప్రాయం వ్యక్తం చేశాడు.
నాలో కొత్త వెర్షన్‌ను చూస్తారు...
సుమారు మూడు దశాబ్దాలుగా సాగుతున్న ప్రొఫెషనల్ కెరీర్‌కు గుడ్‌బై చెప్పే క్రమంలో ‘వన్ లాస్ట్ రోర్’ అంటూ ఈ ఏడాది ముగిసేవరకు ఆడే విధంగా 2020 ఆరంభంలో పేస్ ప్రణాళికలు రూపొందించుకున్నాడు. ఇందులో భాగంగా టోక్యో ఒలింపిక్స్‌లో పాల్గొని ఎనిమిదోసారి ఈ మెగా ఈవెంట్‌లో బరిలోకి దిగిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాలని కూడా అతను కలగన్నాడు. అయితే ఇప్పుడు కోవిడ్–19 కారణంగా అంతా తలకిందులైంది. ఒలింపిక్స్ సంవత్సరంపాటు వాయిదా పడగా... ప్రస్తుత సీజన్‌లో ఎన్ని టెన్నిస్ టోర్నీలు జరుగుతాయనేది కూడా సందేహమే. ఈ నేపథ్యంలో అరుదైన ఘనత సాధించే అవకాశం తనకు దూరం కావచ్చని అతను అభిప్రాయపడ్డాడు.
‘ఒలింపిక్స్ గురించి నేను నిజంగానే ఆందోళన చెందుతున్నాను. ఒక చరిత్ర సృష్టించేందుకు, భవిష్యత్తుపై నా ముద్ర నిలిచిపోయేందుకు నాకు అది మంచి అవకాశంగా కనిపించింది. ఎప్పటికీ గుర్తుంచుకునే విధంగా సీజన్‌ను ముగించాలని అనుకున్నా. కానీ ఏడాది ఆలస్యమైన పరిస్థితుల్లో అది సాధ్యమవుతుందా అనేది సందేహమే. దాదాపు 30 ఏళ్ల ఆట తర్వాత ఇక చాలంటూ రిటైర్ కావాలని గత సెప్టెంబరులో అనుకున్నాను. అయితే విరామం తీసుకొని కుటుంబంతో గడిపాక ఆలోచన మారింది. ముఖ్యంగా గత మూడు నెలలుగా నాన్నతో ఎంతో సమయం వెచ్చించగలగడం సంతోషం. లాక్‌డౌన్ ముగిశాక మళ్లీ కోర్టులోకి అడుగు పెడతాను. ఒక కొత్త వెర్షన్ పేస్‌ను మీరు చూస్తారు. 30 ఏళ్ల వయసు లో ఎలా ఉండేవాడినో అలా వస్తాను’ అని పేస్ వెల్లడించాడు.
Comments
Please login to add a commentAdd a comment