ఇస్తాంబుల్: ఏడుసార్లు విశ్వవిజేత... వరుసగా మూడుసార్లు ఒలింపిక్ చాంపియన్... టర్కీ దిగ్గజ వెయిట్‌లిఫ్టర్ నైమ్ సులేమాన్‌ఒగ్లు అనారోగ్యంతో కన్నుమూశారు. కేవలం 4.8 అడుగుల ఎత్తుండే సులేమాన్‌ఒగ్లును వెయిట్‌లిఫ్టింగ్ ప్రపంచంలో ‘ద పాకెట్ హెర్క్యూలెస్’గా పిలుస్తారు. 50 ఏళ్ల సులేమాన్‌ఒగ్లుకు ఇటీవలే కాలేయ మార్పిడి శస్త్ర చికిత్స జరిగింది.
ఈ చికిత్స తర్వాత ఆయన కోలుకుంటున్నారని వార్తలొచ్చిన నేపథ్యంలో హఠాత్తుగా ఆరోగ్యం విషమించి చనిపోవడంపై క్రీడా ప్రపంచం దిగ్భ్రాంతికి లోనైంది. 1988 సియోల్ (60 కేజీలు), 1992 బార్సిలోనా (60 కేజీలు), 1996 అట్లాంటా (64 కేజీలు) ఒలింపిక్స్ క్రీడల్లో ఆయన స్వర్ణ పతకాలు గెలిచారు. తన శరీర బరువుకు 2.5 రెట్లు బరువునెత్తిన తొలి, ఏకైక వెయిట్ లిఫ్టర్ ఆయనే కావడం విశేషం. 22 ఏళ్లకే 32 ప్రపంచ రికార్డులు నెలకొల్పిన ఆయన 2000లో సిడ్నీ ఒలింపిక్స్ తర్వాత ఆట నుంచి వీడ్కోలు తీసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment