నమూనా చూపుతున్న మహమూద్ అలీ, ఏకేఖాన్
సాక్షి, హైదరాబాద్: నూతన సచివాలయంలో కొత్తగా నిర్మించే మసీదుల నమూనాలు ఖరారయ్యాయి. టర్కీ డిజైన్‌లో వీటి నిర్మాణాలు చేపట్టేందుకు చర్యలు చేపట్టినట్లు హోం మంత్రి మహమూద్ అలీ వెల్లడించారు. ఆయన ఆదివారం తన చాంబర్‌లో మైనారిటీ వ్యవహారాల సలహాదారుడు ఏకే ఖాన్ తదితరులతో కలిసి మసీదుల డిజైన్‌లను పరిశీలించారు. పాత సచివాలయంలో మసీదు ఉన్న చోటే వీటిని నిర్మించనున్నారు.
నమూనాలపై నిపుణుల సలహాలు తీసుకున్నారు. సచివాలయంలో 2,500 చదరపు అడుగుల విస్తీర్ణంతో పెద్ద మసీదు, 400 చదరపు అడుగుల విస్తీర్ణంతో చిన్న మసీదులను అత్యంత సుందరంగా నిర్మించేలా చర్యలు తీసుకుంటున్నట్లు మహమూద్ అలీ చెప్పారు. పెద్ద మసీదు లోపల 400 మంది, బయట ఆవరణలో సుమారు 1,000 మంది ప్రార్థనలు చేసేలా నిర్మాణాలు ఉంటాయన్నారు.
మహిళలు ప్రత్యేకంగా ప్రార్థనలు చేసేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. మొదటి అంతస్తులో వజూఖానా దానిపై ప్రత్యేకంగా ఇమామ్ కోసం నివాస వసతి కూడా ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ నెలాఖరులోగా మసీదు నిర్మాణాలకు శంకుస్థాపన చేసి 9 నెలల్లో పనులు పూర్తి చేస్తామని వెల్లడించారు. వచ్చే మార్చి నాటికి మసీదులను అందుబాటులోకి వచ్చేలా కార్యాచరణ రూపొందించినట్లు వివరించారు.
చదవండి: 4 కోట్ల ఆస్తులు: బుక్కెడు బువ్వ పెట్టరూ..
Comments
Please login to add a commentAdd a comment