లండన్: భారత సంతతికి చెందిన ఓ పోలీస్ అధికారి తన అధికారాన్ని దుర్వినియోగ పరచినందుకుగాను విధుల్లో నుంచి సస్పెండ్ చేశారు. దీనికి కారణం.. అతను ఆఫీస్‌లోని కంప్యూటర్‌లో దిగ్గజ ఫుట్‌బాల్ ఆటగాడు, ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ డేవిడ్ బెక్‌హమ్, అతని భార్య విక్టోరియా బెక్‌హమ్‌లకు సంబంధించిన సమాచారాన్ని వెతకడమే. వివరాల్లోకి వెళితే.. బ్రిటన్‌లోని లీసెస్టర్‌షైర్ ప్రాంతానికి చెందిన పోలీసు విభాగంలో అజిత్ సింగ్(48) పనిచేస్తున్నాడు. అయితే విధుల్లో ఉండి, అధికారాన్ని దుర్వినియోగపరచి బెక్‌హమ్, అతని భార్య విక్టోరియా బెక్‌హమ్‌కు సంబంధించిన సమాచారాన్ని వెతకడంతో పోలీస్ విభాగ అధికారులు అతనిపై క్రమశిక్షణ చర్యలు తీసుకున్నారు.
అజిత్ సింగ్ 2002, 2018 సంవత్సరాల్లో కంప్యూటర్‌లో సమాచారాన్ని దుర్వినియోగపరచాడని తేటతెల్లమైంది. లీసెస్టర్‌లోని మాన్స్‌ఫీల్డ్ హౌస్ పోలీస్ స్టేషన్‌లో అజిత్ సింగ్ విధులు నిర్వర్తిస్తున్నప్పుడు కంప్యూటర్‌ను ఉపయోగించి మొత్తం 146 సార్లు పోలీస్ డేటాబేస్‌ను అనాధికారికంగా వినియోగించాడని రుజువైంది. అందులో ఎక్కువగా డేవిడ్ బెక్‌హమ్, అతని భార్య విక్టోరియా బెక్‌హమ్‌తో పాటు అతని కుటుంబ సభ్యులు, ఆస్తి పాస్తులను గూర్చి ఎక్కువగా వివరాలను సేకరించే ప్రయత్నం చేశాడని రుజువైంది.
ఇందుకుగాను లీసెస్టర్ మేజిస్ట్రేట్ కోర్టు గురువారం దుష్ప్రవర్తన, క్రమశిక్షణ ఉల్లంఘన కింద మూడు నెలల జైలు శిక్షతో పాటు ఎటువంటి విధులు నిర్వర్తించకుండా సంవత్సరంపాటు సస్పెండ్ చేసింది. అంతేకాక చట్టపరమైన ఖర్చులకు 300 పౌండ్‌లు, బాధితులకు సర్‌చార్జీ కింద 115 పౌండ్‌లు చెల్లించాలని ఆదేశించారు. కాగా అజిత్ సింగ్ (48) ప్రస్తుతం అనారోగ్య సెలవుపై ఉన్నారు.
డిటెక్టివ్ ఇన్‌స్పెక్టర్ జూలియన్ లెస్టర్ మాట్లాడుతూ.. ఇటువంటి ప్రవర్తన పోలీసు శాఖలో ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు. నేరారోపణలు రుజువైన పక్షంలో క్రమశిక్షణ ఉల్లంఘన చర్యలు తీసుకుంటామన్నారు. అయితే అజిత్ సింగ్‌కు ఇతరులకు ఎటువంటి హానిచేసే ఉద్దేశం లేదని, కంప్యూటర్‌తో తను శోధించిన సమాచరంతో తనకు చిల్లిగవ్వంత ఆస్తి కూడా సంపాదించలేదని అతని తరపున లాయర్ అలెగ్జాండర్ బార్బర్ కోర్టుకు విన్నవించారు.
Comments
Please login to add a commentAdd a comment