ఐసీసీ తీరుపై షోయబ్ అక్తర్ అసంతృప్తి
కరాచి: ఫాస్ట్ బౌలర్ల విషయంలో ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) అనుసరిస్తున్న తీరుపై పాకిస్తాన్ మాజీ క్రికెటర్, రావల్పిండి ఎక్స్ప్రెస్ షోయబ్ అక్తర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. నిబంధనల పేరుతో ఫాస్ట్ బౌలర్లకు ఐసీసీ ఊపిరాడకుండా చేస్తుందని.. దీంతో క్రికెట్ తన ఆకర్షణను కోల్పోయే ప్రమాదముందని ఆయన హెచ్చరించారు. క్రికెట్‌లో ఫాస్ట్ బౌలర్లే రియల్ క్యారెక్టర్‌లు అనే విషయాన్ని ఐసీసీ గుర్తుంచుకోవాలని అక్తర్ సూచించారు.
ఆటగాళ్లు తమ భావోద్వేగాలను వ్యక్త పరిచే విషయంలో ఐసీసీ అనేక నిబంధనలు విధిస్తోందని అక్తర్ వాపోయారు. 60, 70వ దశకాల్లోని ఫాస్ట్ బౌలర్లు ఇలాంటి నిబంధనలను ఎదుర్కోలేదని.. తమ ఉద్వేగాలను ప్రదర్శించడంలో వారు ఎప్పుడూ భయపడలేదని ఈ సందర్భంగా వెల్లడించారు. ఐసీసీ నిబంధనలు బ్యాట్స్మెన్ అనుకూలంగా ఉంటున్నాయని.. ఈ నిబంధనల వలనే ఫాస్ట్ బౌలర్ల క్వాలిటీ తగ్గుతుందని అక్తర్ ఆవేదన వ్యక్తం చేశారు. న్యూజిలాండ్‌తో జరుగుతున్న టెస్ట్ సిరీస్‌లో తమ ఫాస్ట్ బౌలర్ల ప్రదర్శనపై అక్తర్ అసంతృప్తి వ్యక్తం చేశాడు.