దుమ్మురేపిన హామిల్టన్
బహ్రెయిన్ గ్రాండ్‌ప్రి టైటిల్ సొంతం
సీజన్‌లో మూడో విజయం
మనామా (బహ్రెయిన్): క్వాలిఫయింగ్‌లోనే కాదు ప్రధాన రేసులోనూ తన సత్తా చాటుకున్న మెర్సిడెస్ జట్టు డ్రైవర్ లూయిస్ హామిల్టన్ ఫార్ములావన్ సీజన్‌లో మూడో విజయాన్ని సొంతం చేసుకున్నాడు. ఆదివారం జరిగిన బహ్రెయిన్ గ్రాండ్‌ప్రి రేసులో డిఫెండింగ్ చాంపియన్ హామిల్టన్ విజేతగా నిలిచాడు. 57 ల్యాప్‌ల ఈ రేసును హామిల్టన్ గంటా 35 నిమిషాల 05.809 సెకన్లలో పూర్తి చేసి అగ్రస్థానాన్ని సంపాదించాడు.
తద్వారా బహ్రెయిన్ గ్రాండ్‌ప్రి రేసులో వరుసగా రెండేళ్లు విజేతగా నిలిచిన నాలుగో డ్రైవర్‌గా గుర్తింపు పొందాడు. గతంలో అలోన్సో (2005, 06); మసా (2007, 08), వెటెల్ (2012, 13) ఈ ఘనత సాధించారు. ‘పోల్ పొజిషన్’తో రేసును ఆరంభించిన ఈ బ్రిటన్ డ్రైవర్‌కు చివరి దశలో మాత్రమే ఫెరారీ డ్రైవర్ కిమీ రైకోనెన్ నుంచి పోటీ ఎదురైంది.
దాంతోపాటు తన కారులో చిన్నపాటి సమస్య వచ్చినా హామిల్టన్ నియంత్రణ కోల్పోకుండా డ్రైవ్ చేసి గమ్యానికి చేరుకున్నాడు. ఈ సీజన్‌లో ఆస్ట్రేలియా, చైనా గ్రాండ్‌ప్రిలలో కూడా హామిల్టన్ విజేతగా నిలిచాడు. మరో ల్యాప్ మిగిలి ఉండగా హామిల్టన్ సహచరుడు నికో రోస్‌బర్గ్‌ను ఓవర్‌టేక్ చేసిన రైకోనెన్ చివరకు రెండో స్థానాన్ని దక్కించుకున్నాడు. రోస్‌బర్గ్‌కు మూడో స్థానం, బొటాస్ (విలియమ్స్) నాలుగో స్థానం, వెటెల్ (ఫెరారీ) ఐదో స్థానం సంపాదించారు.
భారత్‌కు చెందిన ఫోర్స్ ఇండియా డ్రైవర్లలో పెరెజ్ ఎనిమిదో స్థానంలో నిలువగా... హుల్కెన్‌బర్గ్ 13వ స్థానంతో సరిపెట్టుకున్నాడు. సీజన్‌లోని తదుపరి రేసు స్పెయిన్ గ్రాండ్‌ప్రి మే 10వ తేదీన జరుగుతుంది. డ్రైవర్స్ చాంపియన్‌షిప్ రేసులో ప్రస్తుతం హామిల్టన్ (93 పాయింట్లు), రోస్‌బర్గ్ (66), వెటెల్ (65) వరుసగా తొలి మూడు స్థానాల్లో ఉన్నారు.