
హామిల్టన్‌దే హవా
రెండు వారాల క్రితం మోంటెకార్లోలో చివరి నిమిషాల్లో విజయాన్ని చేజార్చుకున్న లూయిస్ హామిల్టన్ ఈసారి మాత్రం ఎలాంటి తప్పిదం చేయలేదు...
కెనడా గ్రాండ్‌ప్రి టైటిల్ సొంతం
సీజన్‌లో నాలుగో విజయం
మాంట్రియల్: రెండు వారాల క్రితం మోంటెకార్లోలో చివరి నిమిషాల్లో విజయాన్ని చేజార్చుకున్న లూయిస్ హామిల్టన్ ఈసారి మాత్రం ఎలాంటి తప్పిదం చేయలేదు. కెనడా గ్రాండ్ ప్రిలో ఆద్యంతం ఆధిపత్యం చలాయించి సీజన్‌లో నాలుగో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. భారత కాలమానం ప్రకారం ఆదివారం అర్ధరాత్రి దాటాక జరిగిన కెనడా గ్రాండ్‌ప్రిలో మెర్సిడెస్ జట్టు డ్రైవర్ హామిల్టన్ విజేతగా నిలిచాడు. ‘పోల్ పొజిషన్’తో రేసును ఆరంభించిన హామిల్టన్ నిర్ణీత 70 ల్యాప్‌లను గంటా 31 నిమిషాల 53.145 సెకన్లలో పూర్తి చేసి అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు.
మెర్సిడెస్ జట్టుకే చెందిన నికో రోస్‌బర్గ్ రెండో స్థానాన్ని పొందగా... బొటాస్ (విలియమ్స్), రైకోనెన్ (ఫెరారీ), వెటెల్ (ఫెరారీ) వరుసగా మూడు, నాలుగు, ఐదు స్థానాల్లో నిలిచారు. భారత్‌కు చెందిన ‘ఫోర్స్ ఇండియా’ జట్టుకు ఈ రేసు మిశ్రమ ఫలితాలను మిగిల్చింది. హుల్కెన్‌బర్గ్ ఎనిమిదో స్థానాన్ని పొందగా... సెర్గియో పెరెజ్ 11వ స్థానంతో సరిపెట్టుకున్నాడు. మొత్తం 20 మంది డ్రైవర్లలో ముగ్గురు మధ్యలోనే వైదొలిగారు. ఈ సీజన్‌లో ఆరోసారి ‘పోల్ పొజిషన్’తో రేసును మొదలుపెట్టిన హామిల్టన్ తొలి పది ల్యాప్‌లు ముగిసేసరికి తన సమీప ప్రత్యర్థికంటే 3.7 సెకన్ల ముందున్నాడు. ఆఖరిదాకా ఈ ఆధిక్యాన్ని నిలబెట్టుకున్న అతను సునాయాసంగా గమ్యానికి చేరుకున్నాడు. సీజన్‌లోని తదుపరి రేసు ఆస్ట్రియా గ్రాండ్‌ప్రి ఈనెల 21న జరుగుతుంది.