కుంబ్లేకు ఇచ్చే గౌరవం ఇదేనా?
న్యూఢిల్లీ: భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్ నియామకానికి సంబంధించి బీసీసీఐ ఇటీవల దరఖాస్తుల్ని ఆహ్వానించడంపై లోథా కమిటీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. అదే సమయంలో భారత క్రికెట్ జట్టుకు సక్సెస్ ఫుల్ గా కోచ్ గా ఏడాది పాటు పని చేసిన కుంబ్లేను ఉన్నపళంగా పక్కకు పెట్టడాన్ని సైతం తప్పుబట్టింది. భారత క్రికెట్ జట్టులో ఎంతో ముఖ్యమైన కోచ్ పదవిని ఏడాదికే పరిమితం చేయడం ఎంతమాత్రం సరికాదని లోథా కమిటీ సెక్రటరీ గోపాల్ శంకరనారాయణ విమర్శించారు. క్రికెట్ లో పారదర్శకత అనేది ముఖ్యమని, ప్రజలకు మనం జవాబుదారీగా ఉండాలని గతంలో సుప్రీంకోర్టు పేర్కొన్న విషయాన్ని ఆయన ఈ సందర్బంగా ప్రస్తావించారు.
'బీసీసీఐ పరిపాలకులు సుప్రీంకోర్టు తీర్పుకు లోబడే పని చేయాలి. ఏడాది పాటు కోచ్ ను నియమించే క్రమంలో సుప్రీం తీర్పును పూర్తిస్థాయిలో అమలు చేయలేదనే విషయం స్పష్టమైంది. ప్రస్తుతం జాతీయ క్రికెట్ కోచ్ కు దరఖాస్తుల్ని ఎందుకు కోరాల్సి వచ్చిందో అర్దం కావడం లేదు. కోచ్ గా విజయవంతమైన కుంబ్లే పదవీ కాలాన్ని ఎందుకు పొడిగించడం లేదు. ఒక జాతీయ కోచ్ కు ఇచ్చే గౌరవం ఇదేనా. ఏడాదిపాటు కోచ్ ను నియమించడం ఎంతవరకూ కరెక్ట్. ఇది క్రికెట్ ను ఎంతమాత్రం ముందుకు తీసుకెళ్లడానికి ఉపయోగపడదు అనే విషయం గుర్తించాలి.. మరొక ఏడాదికి ఎవరు కోచ్ గా వస్తారో చూద్దాం 'అని శంకరనారాయణ బీసీసీఐ తీరుపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. గతేడాది కుంబ్లే ను భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్ గా నియమించిన సంగతి తెలిసిందే. ఏడాది కాలానికి కుంబ్లేను కోచ్ గా నియమిస్తూ బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. అయితే అతని పదవి కాలాన్ని పొడిగించకుండా కొత్తగా కోచ్ అభ్యర్దికి దరఖాస్తులు కోరడంపై విమర్శలు వినిపిస్తున్నాయి.