
ఆ గదులను మా గర్ల్ ఫ్రెండ్స్ వద్దన్నారు!
లండన్: రాత్రి వేళ పడుకునే సమయాల్లో వసతి సౌకర్యం సరిగా లేకపోతే కంటి మీద కునుకు రావడం కష్టమే కదా! మరి అటువంటింది ఏకంగా గదుల్లో అనుమానస్పద సంఘటనలు చోటు చేసుకుంటే.. ఇక నిద్దుర మాటే ఉండదు. ఆ తరహా సంఘటనలే ఇంగ్లండ్ క్రికెటర్లకు చోటు చేసుకున్నాయట. గత నెల్లో శ్రీలంకతో లండన్ లో జరిగిన టెస్ట్ మ్యాచ్ సందర్భంగా కొన్ని ఆసక్తిపరిణామాలు సంభవించాయని ఇంగ్లిష్ క్రికెటర్లు ఏకరువు పెట్టినట్లు తాజాగా డైలీ మెయిల్ ఓ కథనాన్ని ప్రచురించింది.
ఆ టెస్టు మ్యాచ్ సందర్భంగా ఏడుగురు ఇంగ్లండ్ క్రికెటర్లకు ఫైవ్ స్టార్ హోదా కల్గిన లంఘమ్ హోటల్లోని గదులను కేటాయిస్తే.. అందులో ఆకస్మికంగా బాత్ రూం లో ట్యాప్ లు వాటికవే ఓపెన్ కావడంతో క్రికెటర్లు భయాందోళనకు గురైనట్లు పేర్కొంది. దీనికి సంబంధించి స్టువర్ట్ బ్రాడ్ కొన్ని నమ్మశక్యం కాని విషయాలను తెలిపినట్లు వెల్లడించింది. ' మేము రాత్రి వేళల్లో గర్ల్ ఫ్రెండ్స్ తో నిద్రిస్తున్న సమయంలో బాత్ రూంలో ట్యాప్ లు ఓపెన్ అయ్యి నీరు దానంతటే వెళ్లిపోయేదని, ఒకవేళ లైట్లు ఆన్ చేసి కట్టేసి వచ్చినా.. తిరిగి అదే పరిస్థితి ఉండేదన్నాడు. అప్పుడు వేసవి కూడా కావడంతో చాలా ఇబ్బందిగా ఉండేదని, కనీసం కంటి మీద కునుకు లేకుండా గడిపామని' బ్రాడ్ తెలిపాడు. దీంతో తమ క్రికెటర్ల భార్యలు, గర్ల్ ఫ్రెండ్స్ ఆ హోటల్ రూమ్ ల్లో ఉండటానికి ఇష్టపడలేదన్నాడు. ఇప్పడు ఇండియాతో ఇక్కడ జరుగుతున్న టెస్ట్ మ్యాచ్ సందర్భంగా కేటాయించిన గదుల్లో సమస్యలు ఏమీ లేవన్నాడు. ఆ తరహా భయానక ఘటనలు ప్రస్తుతం ఏమీ చోటు చేసుకోకపోవడంతో నిద్రలేమి బారిన పడలేదని బ్రాడ్ తెలిపినట్లు డైలీ మెయిల్ కథనంలో పేర్కొంది.