అనుష్క శర్మ వల్లే..
న్యూఢిల్లీ: బాలీవుడ్ నటి అనుష్క శర్మతో క్రికెటర్ విరాట్ కోహ్లి విడిపోయిన తరువాతే అతని ఆట తీరు మెరుగుపడిందంటూ నెటిజన్ల కామెంట్లను భారత మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ ఖండించాడు. అసలు ఆ వ్యాఖ్యల్లో ఎంతమాత్రం నిజం లేదన్న సంగతి గుర్తుంచుకోవాలని క్రికెట్ అభిమానులకు హితవు పలికాడు. విరాట్ ఆట మరింత మెరుగుపడటానికి అనుష్క శర్మే కారణమని ఆమెకు మద్దతుగా నిలిచాడు. ఆ అమ్మాయిలోని సానుకూల దృక్పథమే విరాట్ ఆట తీరులో మార్పులు రావడానికి ఉపకరించిందని జాతీయ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్యూలో గవాస్కర్ పేర్కొన్నాడు.
'విరాట్-అనుష్కల జంట చూడటానికి చాలా ముచ్చటగా ఉంటుంది. విరాట్ లో నిలకడ మరింత పెరగడానికి ఆమె కారణం. విరాట్ జీవితంతో అనుష్క చాల ముఖ్యమైన వ్యక్తి. అతను ఈరోజు ఉన్నతమైన ఆటగాడిగా నిలవడానికి అనుష్క శర్మే కారణమని నా అభిప్రాయం' అని గవాస్కర్ తెలిపాడు.
ఆస్ట్రేలియాతో మ్యాచ్ సందర్భంగా అసాధారణమైన ఇన్నింగ్స్ ఆడినందుకు విరాట్ కోహ్లీని అభినందిస్తూనే, ట్విట్టర్ జనాల్లో చాలామంది అనుష్కాశర్మతో విడిపోయిన తర్వాతే అతడి ఆట బాగుపడిందంటూ రకరకాల కామెంట్లు చేసిన సంగతి తెలిసిందే. దీంతో కోహ్లి కి ఎక్కడ లేని కోపం వచ్చింది. అనవసరంగా ఆమెను ఎందుకు ఆడిపోసుకుంటారని తన ట్వీట్‌లో మండిపడ్డాడు. అనుష్క ఎప్పుడూ తనకు సానుకూల మద్దతే ఇచ్చిందని, ఆమెను నాన్‌స్టాప్‌గా తిట్టడం సరికాదని అన్నాడు. చాలాకాలం పాటు ప్రేమలో మునిగిపోయిన కోహ్లీ, అనుష్క.. ఆ తర్వాత విడిపోవాలని నిర్ణయించుకుని ప్రస్తుతం దూరంగా ఉంటున్నారు.