విజయంతో ముగింపు
చివరి టెస్టులో ఆసీస్ గెలుపు
క్లార్క్, రోజర్స్ రిటైర్
ఓవల్: యాషెస్ సిరీస్‌ను ఇప్పటికే కోల్పోయిన ఆస్ట్రేలియా తమ కెప్టెన్ మైకేల్ క్లార్క్‌కు విజయంతో వీడ్కోలు పలికింది. ఆదివారం ఇక్కడి ముగిసిన చివరి టెస్టులో ఆసీస్ ఇన్నింగ్స్ 46 పరుగుల తేడాతో ఇంగ్లండ్‌ను చిత్తు చేసింది. ఐదు టెస్టుల ఈ యాషెస్ సిరీస్‌ను ఇంగ్లండ్ 3-2తో సొంతం చేసుకుంది. ఈ సిరీస్‌లో రెండవ, ఐదో టెస్టులను ఆసీస్ నెగ్గగా... మిగతా మూడు టెస్టులను కుక్ సేన గెలుచుకుంది. ఓవర్‌నైట్ స్కోరు 203/6తో నాలుగో రోజు ఆట ప్రారంభించిన ఇంగ్లండ్ తమ రెండో ఇన్నింగ్స్‌లో 286 పరుగులకు ఆలౌటైంది. ఆసీస్ బౌలర్లలో సిడిల్‌కు 4 వికెట్లు దక్కాయి. స్మిత్‌కు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు లభించగా... క్రిస్ రోజర్స్ (ఆసీస్), రూట్ (ఇంగ్లండ్)లు ‘మ్యాన్ ఆఫ్ ది సిరీస్’గా నిలిచారు. ఇరు జట్ల మధ్య ఈ నెల 31న ఏకైక టి20 మ్యాచ్, అనంతరం వచ్చే నెల 3 నుంచి ఐదు వన్డేల సిరీస్ జరుగుతుంది. అంతకుముందు ఆసీస్ గురువారం ఐర్లాండ్‌తో ఏకైక వన్డే ఆడుతుంది.
ఈ టెస్టుతో ఆసీస్ కెప్టెన్ క్లార్క్, ఓపెనర్ రోజర్స్ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించారు. మ్యాచ్ ముగిసిన అనంతరం ఇరు జట్ల ఆటగాళ్లు వీరికి ‘గార్డ్ ఆఫ్ ఆనర్’ ఇచ్చి గౌరవించారు. మొత్తం కెరీర్‌లో క్లార్క్ 115 టెస్టుల్లో 49.10 సగటుతో 8643 పరుగులు చేశాడు. ఇందులో 28 సెంచరీలు ఉన్నాయి. రోజర్స్ 25 టెస్టుల్లో 42.87 సగటుతో 5 సెంచరీలు సహా 2015 పరుగులు సాధించాడు.