రంజీ సెమీస్లో మధ్యప్రదేశ్
ముంబై:ఆల్రౌండ్ షోతో అదరగొట్టిన మధ్యప్రదేశ్ రంజీ ట్రోఫీలో సెమీఫైనల్ కు చేరింది. క్వార్టర్ ఫైనల్లో భాగంగా బెంగాల్ తో జరిగిన మ్యాచ్ లో మధ్యప్రదేశ్ 355 పరుగుల తేడాతో విజయం సాధించి సెమీస్ కు చేరింది. మధ్యప్రదేశ్ నిర్దేశించిన 788 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో బెంగాల్ 91.4 ఓవర్లలో 432 పరుగులకే ఆలౌటైంది. 113/3 ఓవర్ నైట్ స్కోరుతో ఆదివారం ఐదో రోజు రెండో ఇన్నింగ్స్ ను కొనసాగించిన బెంగాల్ తీవ్రంగా ప్రతిఘటించినా ఓటమి తప్పలేదు.
బెంగాల్ ఆటగాళ్లలో మనోజ్ తివారీ(124), పంకజ్ షా(118)లు శతకాలతో రాణించగా, అశోక్ దిండా(52) హాఫ్ సెంచరీ నమోదు చేయడం మినహా ఆ జట్టులో మిగతా ఆటగాళ్ల నుంచి సహకారం అందలేదు. మధ్యప్రదేశ్ బౌలర్లలో ఇషాంత్ పాండే నాలుగు వికెట్లు , చంద్రకాంత్ సాక్యూర్ మూడు వికెట్లు సాధించి బెంగాల్ పతనాన్ని శాసించారు. ఈ మ్యాచ్ లో మొత్తం ఎనిమిది వికెట్లు తీసిన ఈశ్వర్ పాండేకు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది. ఫిబ్రవరి 13న కటక్ లో ప్రారంభమయ్యే సెమీ ఫైనల్లో ముంబైతో మధ్యప్రదేశ్ తలపడనుంది.
మధ్యప్రదేశ్ తొలి ఇన్నింగ్స్ 348 ఆలౌట్, రెండో ఇన్నింగ్స్ 560/9 డిక్లేర్
బెంగాల్ తొలి ఇన్నింగ్స్ 121 ఆలౌట్, రెండో ఇన్నింగ్స్ 432 ఆలౌట్