పనిచేయని ధోని మ్యాజిక్
బర్మింగ్‌హామ్: చివరి బంతివరకు ఉత్కంఠభరితంగా జరిగిన ఏకైక టి20లో భారత్ పై ఇంగ్లండ్ మూడు పరుగుల తేడాతో విజయం సాధించింది. ఇంగ్లీషు సేన నిర్దేశించిన 181 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన టీమిండియా 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 177 పరుగులు చేసింది. ఫామ్ లోకి వచ్చిన విరాట్ కోహ్లి అర్థ సెంచరీ చేశాడు. 41 బంతుల్లో 9 ఫోర్లు, సిక్సర్ తో 66 పరుగులు చేశాడు. ధావన్ 33, రైనా 25, రహానే 8 పరుగులు చేశారు. ధోని 27 పరుగులతో నాటౌట్ గా మిగిలాడు.
చివరి ఓవర్ లో 17 పరుగులు అవసరంగా కాగా 13 పరుగులు మాత్రమే వచ్చాయి. లాస్ట్ ఓవర్ లో మ్యాజిక్ చేద్దామనుకున్న ధోని ఆశలు ఫలించలేదు. మొదటి బంతికి సిక్సర్ బాది విజయంపై ధోని ఆశలు రేపాడు. రెండో బంతికి 2, నాలుగో బంతికి 4 పరుగులు వచ్చాయి. మూడు, ఐదు బంతులకు పరుగులు రాలేదు. చివరి బంతికి సింగిల్ మాత్రమే రావడంతో భారత్ మూడు పరుగుల తేడాతో ఓడిపోయింది. ఇంగ్లండ్ బౌలర్లలో ఫిన్, అలీ, గుర్నె, వోక్స్ తలో వికెట్ తీశారు. మోర్గాన్ కు 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' దక్కింది.