56 పరుగులు, సెంచరీ దూరంలో.. ధోనీ, కోహ్లీ
విశాఖపట్నం: భారత్-న్యూజిలాండ్ల మధ్య శనివారం విశాఖపట్నంలో జరిగే ఐదో వన్డే కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ ఐదు వన్డేల సిరీస్లో ఇరు జట్లు 2-2తో సమంగా ఉన్న నేపథ్యంలో ఈ మ్యాచ్ కీలకంగా మారింది. వన్డే క్రికెట్లో మహేంద్ర సింగ్ ధోనీ 199వ సారి టీమిండియాకు సారథ్యం వహించనున్నాడు. అంతేగాక ధోనీ, విరాట్ కోహ్లీ ముందు అరుదైన రికార్డులు ఊరిస్తున్నాయి.
విశాఖ వన్డేలో ధోనీ మరో 56 పరుగులు చేస్తే.. భారత గడ్డపై వన్డే ఫార్మాట్లో 4 వేల పరుగులు చేసిన రెండో ఆటగాడిగా బ్యాటింగ్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ సరసన నిలవనున్నాడు. ఈ ఫార్మాట్లో సచిన్ స్వదేశంలో 6976 పరుగులు చేశాడు.
భారత బ్యాటింగ్ సంచలనం కోహ్లీ కోసం మరో రికార్డు ఎదురు చూస్తోంది. ఛేజింగ్లో గెలిచిన మ్యాచ్ల్లో టీమిండియా తరఫున విరాట్ కోహ్లీ, సచిన్ టెండూల్కర్లు అత్యధికంగా 14 చొప్పున సెంచరీలు చేశారు. కోహ్లీ మరో శతకం బాదితే సచిన్ రికార్డు బ్రేక్ అవుతుంది. విశాఖ స్టేడియంలో విరాట్కు మంచి రికార్డు ఉంది. ఈ వేదికపై కోహ్లీ ఆడిన మూడు మ్యాచ్ల్లో వరుసగా 118, 117, 99 పరుగులు చేశాడు. విశాఖలో ధోనీ, కోహ్లీ రికార్డులు నెలకొల్పుతారేమో చూడాలి.