![Mali bowled out for 6 to record lowest total in women's T20 - Sakshi](/styles/webp/s3/article_images/2019/06/19/mali.jpg.webp?itok=ssclrnm5)
కిగలి సిటీ: ఓ వైపు పురుషుల వన్డే ప్రపంచకప్‌లో ఇంగ్లండ్ కెప్టెన్ మోర్గాన్ 17 సిక్సర్లతో కొత్త ప్రపంచ రికార్డు నమోదు చేస్తే... మరోవైపు మహిళల అంతర్జాతీయ టి20లో 6 పరుగులకే ఆలౌటైన చెత్త రికార్డు మంగళవారం నమోదైంది. క్విబుక మహిళల టి20 టోర్నీలో మాలి జట్టు ఈ కొత్త చెత్త రికార్డును తమ పేర లిఖించుకుంది. రువాండతో జరిగిన పోరులో మొదట బ్యాటింగ్ చేసిన మాలి మహిళల జట్టు 9 ఓవర్లలో 6 పరుగులు చేసి ఆలౌటైంది. మరో ఆసక్తికర విషయమేంటంటే ఓపెనర్ సమకె (1) చేసిన పరుగే టాప్ స్కోర్! ఆ తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన పది మంది ‘జీరో’లే! ఒక్కరు మినహా అందరు 6, 7 బంతులాడి ఖాతా తెరవకుండానే ఔటైతే... కౌలిబెలీ మాత్రం అత్యధికంగా 12 బంతులాడి డకౌటైంది. ఇక మిగతా 5 పరుగులు ఎక్స్‌ట్రాల రూపంలో వచ్చాయి. 2 బైస్, మరో 2 లెగ్‌బైస్, ఒకటేమో వైడ్... ఇది మాలి ఇన్నింగ్స్ కథకమామిషు! ఈ చెత్త రికార్డును ఛేదించేందుకు బరిలోకి దిగిన రువాండ జట్టు 4 బంతులాడి 8 పరుగులు చేసి గెలిచింది. ఇదే ఏడాది జనవరిలో యూఏఈతో జరిగిన మ్యాచ్‌లో చైనా నెలకొల్పిన చెత్త రికార్డు (14 ఆలౌట్)ను మాలి సవరించింది.
Comments
Please login to add a commentAdd a comment