వెల్లింగ్టన్: న్యూజిలాండ్‌తో జరుగుతున్న నాల్గో టీ20లో టీమిండియా 166 పరుగుల టార్గెట్‌ను నిర్దేశించింది. భారత జట్టులో మనీష్ పాండే(50 నాటౌట్; 36 బంతుల్లో 3 ఫోర్లు) మెరవగా, కేఎల్ రాహుల్(39; 26 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లు), శార్దూల్ ఠాకూర్(20;15 బంతుల్లో 2 ఫోర్లు)లు ఫర్వాలేదనిపించారు. మిగతా ఆటగాళ్లు విఫలం కావడంతో భారత్ గౌరవప్రదమైన స్కోరును సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా ఇన్నింగ్స్‌ను కేఎల్ రాహుల్, సంజూ శాంసన్‌లు ఆరంభించారు. అయితే రెండో ఓవర్ మూడో బంతికే శాంసన్(8) భారీ షాట్‌కు పోయి పెవిలియన్ చేరాడు. ఆపై వచ్చిన కెప్టెన్ విరాట్ కోహ్లి(11)సైతం నిరాశపరిచాడు. (ఇక‍్కడ చదవండి: శాంసన్ ఏందిది..?)
కాసేపటికి అయ్యర్(1) కూడా పెవిలియన్ బాట పట్టడంతో భారత జట్టు 52 పరుగులకే మూడు వికెట్లను కోల్పోయింది. ఆ తరుణంలో దూబే(12), మనీష్ పాండేల జోడి కాసేపు ఇన్నింగ్స్‌ను చక్కదిద్దింది. వీరిద్దరూ నాల్గో వికెట్‌కు 23 పరుగులు జత చేసిన తర్వాత దూబే ఔటయ్యాడు. అటు తర్వాత వాషింగ్టన్ సుందర్ మూడు బంతులాడి డకౌట్‌గా నిష్క్రమించగా, శార్దూల్ ఠాకూర్ ఫర్వాలేదనిపించాడు. పాండేతో కలిసి 43 పరుగుల్ని జత చేశాడు. దాంతో టీమిండియా తేరుకుంది. ఇక చివర్లో సైనీ(11 నాటౌట్;9 బంతుల్లో 2 ఫోర్లు) బ్యాట్ ఝుళిపించడంతో టీమిండియా నిర్ణీత ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది. జట్టు కష్టాల్లో పడ్డ సమయంలో మనీష్ పాండే సమయ స్ఫూర్తితో ఆడి ఇన్నింగ్స్‌ను నిలబెట్టాడు. కివీస్ బౌలర్లలో ఇష్ సోధీ మూడు వికెట్లు సాధించగా, బెన్నెట్ రెండు వికెట్లు తీశాడు.సౌతీ, కుగ్‌లీన్, సాన్‌ట్నార్‌లకు తలో వికెట్ లభించింది.
Comments
Please login to add a commentAdd a comment