సిడ్నీ: అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) నిర్వహించే ప్రతీ మెగా ఈవెంట్ షెడ్యూల్‌ను ఎంతో జాగ్రత్తగా ఖరారు చేస్తారు. కాగా, మహిళల టీ20 వరల్డ్‌కప్ షెడ్యూల్ మాత్రం అందుకు భిన్నంగా కనబడుతోంది. చావో రేవో తేల్చుకోవాల్సిన నాకౌట్ మ్యాచ్‌లకు రిజర్వ్ డే లేకుండా షెడ్యూల్ చేయడం ఇప్పుడు విమర్శలకు దారి తీసింది. గ్రూప్ స్టేజ్‌లో రెండు మ్యాచ్‌లు వర్షార్పణం కాగా, నాకౌట్ స్టేజ్‌లో ఒక మ్యాచ్ టాస్ కూడా పడకుండానే రద్దయ్యింది. ఈరోజు భారత్-ఇంగ్లండ్ జట్ల మధ్య జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దయ్యింది. భారీ వర్షం కురవడంతో మ్యాచ్‌ను రద్దు చేశారు. దాంతో గ్రూప్ స్టేజ్‌లో అసలు ఓటమి అనేది లేకుండా మెరుగైన రన్‌రేట్ కల్గి ఉన్న భారత్ ఫైనల్‌కు చేరింది. ఇక్కడ రిజర్వ్ డే లేకపోవడంతో ఇంగ్లండ్ భారంగా టోర్నీ నుంచి వైదొలగాల్సి వచ్చింది. (వరల్డ్ టీ20: ఫైనల్‌కు టీమిండియా తొలిసారి)
గత వరల్డ్‌కప్‌లో రన్నరప్‌గా నిలిచిన ఇంగ్లండ్.. ఈసారి సెమీస్‌తోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. మ్యాచ్ జరిగి ఓడిపోతే పెద్దగా బాధించకపోవచ్చు కానీ, అసలు గేమ్ జరగకుండా ఇలా టోర్నీని ముగించడం ఎవరికైనా బాధగానే ఉంటుంది. ఇదే విషయాన్ని ప్రస్తావించిన ఆసీస్ మాజీ కెప్టెన్ మార్క్ వా.. ఐసీసీ తీరుపై ఫైర్ అయ్యాడు. అసలు రిజర్వ్ డే లేకుండా నాకౌట్ మ్యాచ్‌లు ఏర్పాటు చేయడం ఏమిటని ప్రశ్నించాడు. అందులోనూ అతి పెద్ద టోర్నీల్లో ఇలా చేయడం ఎంతవరకు కరెక్ట్ అనుకుంటున్నారని నిలదీశాడు. చాలా మందికి వరల్డ్‌కప్‌లాంటి మెగా టోర్నీలు ఆడటం వారి జీవితాశయంగా ఉంటుంది. అటు వంటప్పుడు నాకౌట్ వంటి పెద్ద మ్యాచ్‌లు ఆడాల్సి రావడాన్ని కూడా గొప్పగా ఆస్వాదిస్తారు. నాకౌట్ మ్యాచ్‌లకు రిజర్వ్ డే లేకపోవడం అర్థరహితం. ఇది దారుణంగా అనిపిస్తోంది. ఫైనల్ మ్యాచ్ కూడా రిజర్వ్ డే లేకపోవడం ఇంకా ఆశ్చర్యానికి గురి చేస్తోంది’ అని మార్క్ వా ధ్వజమెత్తాడు.
Comments
Please login to add a commentAdd a comment