ఆక్లాండ్:న్యూజిలాండ్ ఓపెనర్ మార్టిన్ గప్టిల్ సరికొత్త టీ 20 రికార్డు నమోదు చేశాడు. అంతర్జాతీయ ట్వంటీ 20ల్లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా నిలిచాడు. ఈ క‍్రమంలోనే తన దేశానికి చెందిన బ్రెండన్ మెకల్లమ్ రికార్డును గప్టిల్ బద్ధలు కొట్టాడు. ముక్కోణపు సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో గప్టిల్ ఈ మార్కును చేరాడు. 54 బంతుల్లో 6 ఫోర్లు, 9 సిక్సర్లతో 105 పరుగులు సాధించడంతో టీ 20ల్లో అత్యధిక పరుగులు నమోదు చేసిన ఆటగాడిగా గప్టిల్ గుర్తింపు సాధించాడు. ప్రస్తుతం గప్టిల్ 2,188 పరుగులతో ముందంజంలో ఉండగా, మెకల్లమ్ 2,140 రెండో స్థానంలో ఉన్నాడు. ఇక్కడ విరాట్ కోహ్లి(1,956) మూడో స్థానంలో నిలిచాడు.
కాగా, మెకల్లమ్ పేరిట ఉన్న మరో రికార్డును కూడా గప్టిల్ బ్రేక్ చేశాడు. న్యూజిలాండ్ తరపున వేగవంతంగా టీ 20 సెంచరీ నమోదు చేసిన ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. 49 బంతుల్లో శతకం సాధించడం ద్వారా మెకల్లమ్ రికార్డును గప్టిల్ సవరించాడు. అంతకుముందు న్యూజిలాండ్ తరపున వేగవంతమైన ట్వంటీ 20 సెంచరీని మెకల్లమ్(50 బంతుల్లో) పేరిట ఉంది.
ఈ మ్యాచ్‌లో టాస్ నెగ్గి తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 244 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ఓపెనర్ గప్టిల్ కు తోడు మరో ఓపెనర్ మున్రో (33 బంతుల్లో 76: 6ఫోర్లు, 6 సిక్సర్లు) హాఫ్ సెంచరీతో రాణించడంతో కివీస్ జట్టు నిర్ణీత 20ఓవర్లలో 6 వికెట్లు నష్టపోయి 243 పరుగులు చేసింది.
అనంతరం 244 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్‌కు ఓపెనర్లు డేవిడ్ వార్నర్ (24 బంతుల్లో 59: 4ఫోర్లు, 5 సిక్సర్లు), షార్ట్ (44 బంతుల్లో 76: 8ఫోర్లు, 3 సిక్సర్లు) అర్ధశతకాలతో రాణించి తొలి వికెట్‌కు సెంచరీ భాగస్వామ్యం అందించారు. 121 పరుగుల వద్ద వార్నర్ ను కివీస్ బౌలర్ సోదీ బౌల్డ్ చేశాడు. ఆపై క్రిస్ లిన్ (18), మాక్స్‌వెల్ (14 బంతుల్లో 31: 3ఫోర్లు, 2 సిక్సర్లు)తో కలిసి షార్ట్ ఇన్నింగ్స్‌ను నడిపించాడు. చివర్లో అరోన్ ఫించ్ (14 బంతుల్లో 36: 3ఫోర్లు, 3 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్‌తో 18.5 ఓవర్లలో మరో 7 బంతులుండగానే జట్టును విజయతీరాలకు చేర్చాడు. దీంతో ట్వంటీ20 చరిత్రలో రికార్డు ఛేజింగ్ ఆసీస్ (245/5) పేరిట నమోదైంది. గతంలో ఈ ఛేజింగ్ రికార్డు వెస్టిండీస్ పేరిట ఉండేది. దక్షిణాఫ్రికాపై 231 పరుగుల లక్ష్యాన్ని 19.2 ఓవర్లలో విండీస్ ఛేదించింది.
Comments
Please login to add a commentAdd a comment