అటు నేనే... ఇటు నేనే..! | Martina Hingis special | Sakshi
Sakshi News home page

అటు నేనే... ఇటు నేనే..!

Published Fri, Jul 17 2015 12:29 AM | Last Updated on Sun, Sep 3 2017 5:37 AM

అటు నేనే... ఇటు నేనే..!

అటు నేనే... ఇటు నేనే..!

మార్టినా హింగిస్ టెన్నిస్‌కు, భారత అభిమానులకు కూడా కొత్తేం కాదు. ఒకప్పుడు సింగిల్స్‌లో ఒక వెలుగు వెలిగిన ఈ స్విస్ తార అందరికీ సుపరిచితమే. అయితే ఈసారి వింబుల్డన్‌లో భారత్‌కు లభించిన రెండు టైటిల్స్‌లోనూ తన పాత్ర ఉంది. సానియాతో జతగా డబుల్స్, పేస్ జోడీగా మిక్స్‌డ్ డబుల్స్ నెగ్గింది. మనోళ్లతో హింగిస్‌కు ఎలా జోడీ కుదిరింది. ఒకప్పుడు ప్రపంచ సింగిల్స్ నంబర్‌వన్ ఇప్పుడు డబుల్స్ మాత్రమే ఎందుకు ఆడుతోంది?

వింబుల్డన్‌లో భారత్ గర్వించదగ్గ రెండు విజయాల్లోనూ స్విట్జర్లాండ్ స్టార్ హింగిస్ పాత్ర ఉంది. భారత క్రీడాకారులతో జతకట్టి రెండు టైటిల్స్ సాధించిన హింగిస్.. తిరిగి పూర్వ వైభవాన్ని సంపాదించుకుంది. అమెరికాలో టీమ్ టెన్నిస్ పోటీల సందర్భంగా పేస్, హింగిస్‌ల జోడీ కుదిరింది. పేస్ తనలో ఆత్మవిశ్వాసాన్ని పెంచాడని చెప్పిన ఈ స్విస్ స్టార్... ఈ ఏడాది రెండు మిక్స్‌డ్ డబుల్స్ టైటిల్స్ సాధించింది. ఆస్ట్రేలియన్ ఓపెన్, వింబుల్డన్ రెండింటిలోనూ పేస్‌తో కలిసి కప్‌ను ముద్దాడింది.

ఇక సానియా గత ఏడాది వరకు కారా బ్లాక్‌తో కలిసి డబుల్స్ ఆడింది. ఈ ఏడాది ఆరంభంలో కొత్త భాగస్వామిని ప్రయత్నించినా ఉపయోగం లేకపోయింది. ఇదే సమయంలో హింగిస్ కూడా తగిన డబుల్స్ భాగస్వామి లేక ఇబ్బంది పడుతోంది. గత ఏడాది ఐపీటీఎల్ సందర్భంగా ఏర్పడిన సాన్నిహిత్యంతో ఈ ఇద్దరి కామన్ స్నేహితుడు ఒకరు కలిసి ఆడమని సూచించారు. దీంతో ఈ ఇద్దరూ మార్చిలో జతకట్టారు. అప్పటి నుంచి ఎదురులేకుండా దూసుకుపోతున్నారు.
 
హింగిస్ కెరీర్ ఆసక్తికరం
 అవిభాజ్య చెకోస్లొవేకియాలో 1980, సెప్టెంబరు 30న జన్మించిన హింగిస్ ఏడేళ్ల వయసులో స్విట్జర్లాండ్‌కు వలస వెళ్లింది. తల్లి మెలానీ శిక్షణలో రాటుదేలి 14 ఏళ్లకే ప్రొఫెషనల్‌గా మారింది. ఏడాదిన్నర తిరిగేలోపు ‘గ్రాండ్‌స్లామ్ చాంపియన్’గా అవతరించింది. 1996లో 15 ఏళ్ల 9 నెలల వయసులో హెలెనా సుకోవాతో కలిసి వింబుల్డన్ టోర్నీలో మహిళల డబుల్స్ టైటిల్‌ను సాధించింది. ఈ విజయంతో పిన్న వయసులో గ్రాండ్‌స్లామ్ టైటిల్ సాధించిన క్రీడాకారిణిగా గుర్తింపు పొందిన హింగిస్... 1997లో ఆస్ట్రేలియన్ ఓపెన్, వింబుల్డన్, యూఎస్ ఓపెన్ టైటిల్స్ సొంతం చేసుకొని పెను సంచలనం సృష్టించింది. 1998లో ఒకే సీజన్‌లో నాలుగు గ్రాండ్‌స్లామ్ టోర్నీల్లో డబుల్స్ టైటిల్స్ సాధించి అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఈ క్రమంలో  పిన్న వయస్సులో సింగిల్స్, డబుల్స్ విభాగాలలో ప్రపంచ నంబర్‌వన్ ర్యాంక్‌ను అందుకున్న ప్లేయర్‌గా రికార్డు
 
 http://img.sakshi.net/images/cms/2015-07/41437073544_Unknown.jpgనెలకొల్పింది.
 2001లో తన కోచ్‌గా ఉన్న తల్లి మెలానీతో విడిపోవడం... కుడి చీలమండ గాయం కారణంగా హింగిస్ ఆటతీరు లయ తప్పింది. అదే ఏడాది కాప్రియాటికి నంబర్‌వన్ ర్యాంక్ కోల్పోయిన హింగిస్, 2003లో ఆశ్చర్యకరంగా రిటైర్మెంట్ ప్రకటించింది. రెండేళ్ల తర్వాత తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్న హింగిస్ మళ్లీ రాకెట్ పట్టింది. అయితే ఆమెలో మునుపటి జోరు కనిపించలేదు. నాలుగేళ్లపాటు ఆడిన ఆమె ఖాతాలో మరో గ్రాండ్‌స్లామ్ టైటిల్ మాత్రం చేరలేదు. 2007లో డోపింగ్‌లో పట్టుబడిన హింగిస్‌పై అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) రెండేళ్లపాటు నిషేధం విధించింది.

 నిషేధం ముగిసిన తర్వాత ఇన్విటేషన్, లెజెండ్స్‌లాంటి విభాగాలలో సరదాగా టెన్నిస్ ఆడిన హింగిస్ 2013లో మళ్లీ కెరీర్‌పై సీరియస్‌గా దృష్టి సారించింది. అయితే ఈసారి సింగిల్స్‌ను వదులుకొని డబుల్స్‌కే పరిమితమైంది. పలువురు క్రీడాకారిణులతో జతకట్టిన హింగిస్ గొప్ప విజయాన్ని రుచి చూడలేకపోయింది. అయితే 2015లో భారత టెన్నిస్ దిగ్గజం లియాండర్ పేస్‌తో భాగస్వామ్యం హింగిస్ కెరీర్‌కు కొత్త ఊపిరి పోసింది.

 మూడు పదుల వయసు దాటినా అపార అనుభవానికి నైపుణ్యం జతకలవడంతో హింగిస్ పూర్వ వైభవం దిశగా అడుగులు వేసింది. శక్తివంతమైన గ్రౌండ్‌స్ట్రోక్‌లు, పదునైన రిటర్న్‌లు చేయడంలో తిరుగులేని హింగిస్‌కు ఈ ఏడాది మార్చిలో హైదరాబాద్ అమ్మాయి సానియా మీర్జా రూపంలో మరో మంచి భాగస్వామి లభించింది. సానియా సర్వీస్‌లో నిలకడ, శక్తివంతమైన ఫోర్‌హ్యాండ్ షాట్‌లు... నెట్‌వద్ద హింగిస్ అప్రమత్తతతో ఈ జోడీకి తిరుగులేకుండా పోయింది. ఇప్పుడు 34 ఏళ్ల హింగిస్ లక్ష్యం వచ్చే ఏడాది బ్రెజిల్‌లో జరిగే రియో ఒలింపిక్స్‌లో స్వర్ణం గెలవడం.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement