సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర మాస్టర్స్ అథ్లెటిక్స్ సంఘం ఆధ్వర్యంలో నేటి నుంచి జాతీయ స్థాయి మాస్టర్స్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ జరుగుతుంది. గచ్చిబౌలి అథ్లెటిక్స్ స్టేడియం వేదికగా ఈనెల 25వ తేదీ వరకు ఈ పోటీలను నిర్వహిస్తారు. దేశవ్యాప్తంగా ఉన్న 4,000 మంది అథ్లెట్లు ఈ పోటీల్లో పాల్గొంటారని శాట్స్ చైర్మన్ ఎ. వెంకటేశ్వర రెడ్డి తెలిపారు. 35 ఏళ్లు పైబడిన వయో విభాగం నుంచి 95 ఏళ్లు పైబడిన వయోవిభాగం స్థాయిలో 25 ఈవెంట్‌లలో పోటీలు నిర్వహిస్తున్నట్లు ఆయన చెప్పారు.
ఈ పోటీల్లో అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులు కూడా పాల్గొంటారన్న శాట్స్ చైర్మన్... తెలంగాణ నుంచి 290 మంది అథ్లెట్లు ఇందులో తలపడుతున్నారని చెప్పారు. ఈ టోర్నీ ప్రారంభోత్సవంలో రాష్ట్ర మంత్రులు ఈటల రాజేందర్, టి. పద్మారావు, నగర మేయర్ బొంతు రామ్మోహన్ ముఖ్య అతిథులుగా పాల్గొంటారు. వరల్డ్ మాస్టర్స్ అథ్లెటిక్స్ సంఘానికి (డబ్ల్యూఎంఏ) చెందిన స్టాన్ పెర్కిన్స్, ఐఏఏఎఫ్ మాస్టర్స్ కమిషన్‌కు చెందిన విన్‌స్టన్ థామస్, ఆస్ట్రేలియన్ మాస్టర్స్ అసోసియేషన్‌కు చెందిన విల్మా పెర్కిన్స్ కూడా ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారు.