‘క్యూ స్లామ్’కు శ్రీకారం
ఆగస్ట్ 19నుంచి మాస్టర్స్ లీగ్
హైదరాబాద్: బిలియర్డ్స్ క్రీడను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు కొత్త తరహా ఆటను చూపించక తప్పని పరిస్థితి ఏర్పడిందని భారత దిగ్గజం, 16 సార్లు వరల్డ్ చాంపియన్ పంకజ్ అద్వానీ అభిప్రాయ పడ్డాడు. ఈ క్రమంలో తొలి సారి భారత్‌లో ‘క్యూ లీగ్’కు శ్రీకారం చుట్టినట్లు అతను చెప్పాడు. ‘ఇండియన్ క్యూ మాస్టర్స్ లీగ్’ పేరుతో ఆగస్టు 19నుంచి 25 వరకు ఈ టోర్నీ అహ్మదాబాద్‌లో జరుగుతుంది. స్పోర్ట్స్ లైవ్ సంస్థ ఈ లీగ్‌కు ప్రమోటర్‌గా వ్యవహరిస్తోంది.
హైదరాబాద్ హస్లర్స్, ఢిల్లీ డాన్‌స్, చెన్నై షార్క్స్, గుజరాత్ కింగ్స్, బెంగళూరు బడ్డీస్ పేర్లతో 5 జట్లు బరిలోకి దిగుతున్నాయి. ఒక్కో జట్టులో ఐదుగురు చొప్పున 25 మంది ఆటగాళ్లు ఈ లీగ్ బరిలోకి దిగుతున్నారు. వీరిలో ఆరుగురు మహిళలు ఉన్నారు. ఈ కార్యక్రమంలో భారత బిలియర్డ్స్ సమాఖ్య కార్యదర్శి బాలసుబ్రహ్మణ్యం, స్పోర్ట్స్ లైవ్ ప్రతినిధులు ప్రసాద్, అతుల్ పాల్గొన్నారు.