కోహ్లి నిలబడ్డాడు!
రాజ్కోట్:ఇంగ్లండ్ తో ఇక్కడ జరిగిన తొలి టెస్టును టీమిండియా డ్రాతో ముగించింది. ఆదివారం ఇంగ్లండ్ విసిరిన 310 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత ఆటగాళ్లు తడబడినా, కెప్టెన్ విరాట్ కోహ్లి అడ్డంగా నిలబడి మ్యాచ్ డ్రా కావడంలో కీలక పాత్ర పోషించాడు. భారీ లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన భారత జట్టు స్కోరు బోర్డుపై పరుగులేమీ లేకుండా గౌతం గంభీర్(0)వికెట్ ను కోల్పోయింది. ఆ తరుణంలో మురళీ విజయ్ తో జత కలిసిన చటేశ్వర పూజారా ఇన్నింగ్స్ ను చక్కదిద్దే యత్నం చేశాడు. అయితే జట్టు స్కోరు 47 పరుగుల వద్ద పూజారా(18) అవుట్ కాగా,ఆపై కాసేపటికి విజయ్ (31), అజింక్యా రహానే(1)లు నిష్క్రమించారు.
దాంతో 71 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయిన భారత జట్టు కష్టాల్లో పడింది. అయితే విరాట్ కోహ్లి-రవి చంద్రన్ అశ్విన్ల జోడి 47 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేయడంతో భారత్ జట్టు తేరుకుంది. కాగా, అశ్విన్(32), సాహా(9)లు 14 పరుగుల వ్యవధిలో వరుసగా పెవిలియన్ చేరడంతో మరొకసారి భారత తడబడినట్లు కనిపించింది. మరొకవైపు విరాట్ కోహ్లి(49 నాటౌట్;98 బంతుల్లో 6ఫోర్లు) మాత్రం అత్యంత నిలకడను ప్రదర్శించాడు. అతనికి జతగా రవీంద్ర జడేజా(32 నాటౌట్) ఆకట్టుకున్నాడు. ఆట ముగిసేసమయానికి భారత్ ఆరు వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసి మ్యాచ్ ను డ్రా చేసుకుంది.
ఈ రోజు ఆటలో ఇంగ్లండ్ తన రెండో ఇన్నింగ్స్ ను 260/3 వద్ద డిక్లేర్ చేసింది. దాంతో ఇంగ్లండ్ కు 309 పరుగుల ఆధిక్యం లభించింది. 114/0 ఓవర్ నైట్ స్కోరుతో రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన ఇంగ్లండ్ తొలి సెషన్ లో రెండు వికెట్లను కోల్పోయింది.ఓపెనర్ హసీబ్ హమీద్(82)ను తొలి వికెట్ గా కోల్పోయిన ఇంగ్లండ్.. ఆ తరువా జో రూట్(4)వికెట్ ను నష్టపోయింది. ఆ తరువాత బెన్ స్టోక్స్ (29 నాటౌట్)తో కలిసి కుక్ ఇన్నింగ్స్ ను ముందుకు తీసుకెళ్లాడు. ఈ క్రమంలోనే కుక్(130) సెంచరీ సాధించాడు. అయితే కుక్ అవుటైన అనంతరం ఇంగ్లండ్ తన ఇన్నింగ్స్ ను డిక్లేర్ చేసింది.