మమ్మల్నికోహ్లి భయపెట్టాడు!
సిడ్నీ: నాల్గో వన్డేలో టీమిండియా ఆటగాడు విరాట్ కోహ్లి తన ఆట తీరుతో భయపెట్టాడని ఆస్ట్రేలియా ఆటగాడు మ్యాక్స్ వెల్ స్పష్టం చేశాడు. తాము తొలుత బ్యాటింగ్ చేసి భారీ పరుగులను స్కోరు బోర్డుపై ఉంచినా.. విరాట్ ఆటతో ఒక్కసారిగా పరిస్థితి మారిపోయిందన్నాడు. ఒకానొక దశలో తమ నుంచి మ్యాచ్ ను పూర్తిగా తన చేతుల్లోకి లాగేసుకుని తమ గుండెల్లో రైళ్లు పరుగెత్తించాడని మ్యాక్స్ వెల్ పేర్కొన్నాడు. తాను విరాట్ ను విమర్శించానని వచ్చిన వార్తల్లో ఎటువంటి నిజం లేదన్నాడు.
నాలుగో వన్డేకు సంబంధించి పలు విషయాలను ట్విట్టర్ ద్వారా పంచుకున్న మ్యాక్స్ వెల్.. విరాట్ ను పొగడ్తలతో ముంచెత్తాడు. ఆ మ్యాచ్ లో కోహ్లి ఆడిన తీరు నిజంగా అద్భుతమన్నాడు. తీవ్రమైన ఒత్తిడిలో విరాట్ పోరాటం అద్వితీయమన్నాడు. ఆ సమయంలో విరాట్ మాదిరిగా ఆడటం ప్రపంచంలో ఏ ఒక్క ఆటగాడికి సాధ్యం కాకపోవచ్చని మ్యాక్స్ వెల్ అభిప్రాయపడ్డాడు. ఒకవేళ విరాట్ ఇంకా కాసేపు క్రీజ్ లో ఉంటే ఆ మ్యాచ్ లో టీమిండియా విజయం సాధించేదన్నాడు. విరాట్ ఫీల్డ్లో ఉన్నంత సేపు టీమిండియాను కట్టడి చేయడం తమ వల్ల కాలేదని మ్యాక్స్ వెల్ తెలిపాడు.
నాల్గో వన్డేలో గాయపడ్డ మ్యాక్స్ వెల్ ఆఖరి వన్డేలో ఆడే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. ఇషాంత్ శర్మ బౌలింగ్ లో గాయపడ్డ మ్యాక్ప్ వెల్ కుడి మోకాలి వాపు పూర్తిగా తగ్గక పోవడంతో అతని విశ్రాంతి ఇచ్చే అవకాశం ఉంది. ఈ సిరీస్ లో కీలకమైన మూడు, నాలుగు వన్డేల్లో మ్యాక్స్ వెల్ రాణించి ఆసీస్ సిరీస్ విజయంలో ముఖ్య భూమిక పోషించాడు.