
హరారే: రెండు రోజుల క్రితం ఆసీస్‌తో జరిగిన టీ 20 ముక్కోణపు సిరీస్ ఫైనల్లో పాకిస్తాన్ విజయం సాధించి విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. పాకిస్తాన్ ఆరు వికెట్ల తేడాతో గెలిచి ముక్కోణపు సిరీస్‌ను కైవసం చేసుకుంది. అయితే మ్యాచ్ ముగిసిన తర్వాత ఆసీస్ ఆటగాడు మ్యాక్స్‌వెల్ క్రీడా స్ఫూర్తిని మరిచాడు. పాకిస్తాన్ క్రికెటర్లతో కరాచలనం చేసే క్రమంలో మ్యాక్స్‌వెల్ అతిగా ప్రవర్తించాడు. అంపైర్లకు షేక్ హ్యాండ్ ఇచ్చిన మ‍్యాక్స్ వెల్.. అదే సమయంలో పాకిస్తాన్ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్‌తో కరాచలనం చేయడానికి ఆసక్తికనబరచలేదు. సర్ఫరాజ్ షేక్ హ్యాండ్ ఇవ్వడానికి ముందుకు వచ్చినా మ్యాక్సీ పట్టించుకోకుండా నడుచుకుంటూ వెళ్లిపోయాడు.
ఈ మ్యాచ్ జరుగుతున్న క్రమంలో వీరిద్దరి మధ్య పదే పదే మాటల యుద్ధం జరగడమే మ్యాక్సీ అలా ప్రవర్తించడానికి ప్రధాన కారణంగా తెలుస్తోంది. మరొకవైపు ఆసీస్ ఓడి పోవడాన్ని కూడా మ్యాక్స్‌వెల్ జీర్ణించుకోలేకపోయినట్లున్నాడు. అయితే ప్రత్యర్థి ఆటగాళ్లతో మ్యాక్సీ వ్యవహరించిన తీరు విమర్శలకు దారి తీసింది. దీనిపై మ్యాక్సీ తాజాగా వివరణ ఇస్తూ.. అది కావాలని చేసింది కాదని సర్దిచెప్పుకునే యత్నం చేశాడు. కేవలం పొరపాటులో భాగంగానే అలా జరిగిందన్నాడు. ఆ తర్వాత సర్పరాజ్‌ను హోటల్ కలిసి అభినందించినట్లు పేర్కొన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment