'మ్యాక్స్వెల్ పోటీలోనే లేడు'
అడిలైడ్:గతనెల్లో అడిలైడ్లో దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టు మ్యాచ్కు తనను ఎంపిక చేయకపోవడాన్ని బహిరంగంగా తప్పుబట్టిన గ్లెన్ మ్యాక్స్వెల్ తీరుపై ఆ దేశ క్రికెట్ చీఫ్ కోచ్ డారెన్ లీమన్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. గత రెండేళ్లుగా వంద శాతం ప్రదర్శన ఇవ్వలేని క్రికెటర్ను కీలకమైన టెస్టుకు ఎంపిక చేయడం ఎంతవరకూ సమంజసమనే విషయం అతనే తెలుసుకోవాలని కౌంటర్ ఇచ్చాడు. చాలా కాలం నుంచి మ్యాక్స్వెల్ ఆట తీరులో నాణ్యత లోపించిందనే విషయం గ్రహిస్తే మంచిదన్నాడు. ఇటీవల కాలంలో ఆ క్రికెటర్ సాధించిన భారీ పరుగులు ఏమీ లేని కారణంగానే అతని ఎంపికను పక్కకు పెట్టాల్సి వచ్చిందన్నాడు.
'2014 నుంచి షిఫెల్డ్ షీల్డ్ టోర్నీలో తొమ్మిది మ్యాచ్లు ఆడిన మ్యాక్స్వెల్ ఒక్క సెంచరీ కూడా చేయలేదు. ఫామ్లేని ఆటగాడ్ని ఎలా జాతీయ జట్టులోకి ఎంపిక చేస్తాం. అతన్ని ఎంపిక చేయకపోవడంపై బాహబాటంగా విమర్శలు కురిపించడం మమ్మల్ని నిరూత్సాహ పరిచింది. ఆస్ట్రేలియా క్రికెట్ క్యాంప్లో ఆత్మవిశ్వాసాన్ని నింపుకునే ప్రయత్నం చేయాలి. అంతేగానీ అతన్ని కాదని వేరే క్రికెటర్ని ఎంపిక చేశారంటూ విమర్శలు చేయడం తగదు. అసలు అడిలైడ్ టెస్టుకు మ్యాక్స్ వెల్ పోటీలోనే లేడు ' అని లీమన్ స్పష్టం చేశాడు.
దక్షిణాఫ్రికాతో అడిలైడ్లో జరిగిన టెస్టు మ్యాచ్లో మ్యాక్స్వెల్ ను పక్కకు పెట్టిన సంగతి తెలిసిందే. దాంతో పాటు వికెట్ కీపర్ మాథ్యూ వేడ్ను ఆ మ్యాచ్కు ఎంపిక చేయడాన్ని మ్యాక్స్ వెల్ ప్రశ్నించాడు. అతని ఎంపిక తనను ఆశ్చర్యానికి లోను చేసిందంటూ బహిరంగంగా సెలక్షన్ కమిటీ తీరును మ్యాక్స్ వెల్ తప్పుబట్టాడు.