బిగ్‌బాష్ లీగ్‌లో మెల్‌బోర్న్ స్టార్స్ ఆటగాడు గ్లెన్ మ్యాక్స్‌వెల్ ఓ భారీ రికార్డును సాధించాడు. లీగ్ చరిత్రలో 3000 పరుగుల మార్కును దాటిన ఆరో ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. బీబీఎల్ 2024-25లో భాగంగా సిడ్నీ సిక్సర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో మ్యాక్సీ ఈ అరుదైన ఘనత సాధించాడు.
మ్యాక్సీకి ముందు క్రిస్ లిన్, ఆరోన్ ఫించ్, డిఆర్కీ షార్ట్, మోసెస్ హెన్రిక్స్, జాన్ వెల్స్ మాత్రమే బీబీఎల్‌లో 3000 పరుగుల మైలురాయిని తాకారు. సిడ్నీ సిక్సర్స్‌తో మ్యాచ్‌లో మెరుపు అర్ద శతకం బాదిన మ్యాక్సీ.. బీబీఎల్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో వెల్స్, హెన్రిక్స్‌లను అధిగమించాడు.
బిగ్‌బాష్ లీగ్‌లో అత్యధిక పరుగులు చేసిన టాప్-5 బ్యాటర్స్..
క్రిస్ లిన్-3908
ఆరోన్ ఫించ్-3311
డిఆర్కీ షార్ట్-3102
గ్లెన్ మ్యాక్స్‌వెల్-3047
మోసెస్ హెన్రిక్స్-3035
మ్యాక్సీ మెరుపు అర్ద శతకం
సిడ్నీ సిక్సర్స్‌తో మ్యాచ్‌లో మ్యాక్స్‌వెల్ మెరుపు అర్ద శతకం సాధించాడు. ఈ మ్యాచ్‌లో అతను 32 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో అజేయమైన 58 పరుగులు చేశాడు. ఫలితంగా మెల్‌బోర్న్ స్టార్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 156 పరుగులు చేసింది.
మెల్‌బోర్న్ ఇన్నింగ్స్‌లో బ్యూ వెబ్‌స్టర్ (48) ఓ మోస్తరు స్కోర్ చేయగా.. బెన్ డకెట్ (20), డాన్ లారెన్స్ (14) రెండంకెల స్కోర్లు చేశారు. సామ్ హార్పర్ (4), కెప్టెన్ మార్కస్ స్టోయినిస్ (4) విఫలమయ్యారు. సిక్సర్స్ బౌలర్లలో సీన్ అబాట్ మూడు వికెట్లు పడగొట్టగా.. జాక్ ఎడ్వర్డ్స్, హేడెన్ కెర్ తలో వికెట్ దక్కించుకున్నారు.
19వ హాఫ్ సెంచరీ
ఈ మ్యాచ్‌లో మ్యాక్సీ చేసిన హాఫ్ సెంచరీ బీబీఎల్‌లో అతనికి 19వది. ఓవరాల్‌గా అతను టీ20ల్లో 55 అర్ద శతకాలు సాధించాడు. టీ20 కెరీర్‌లో 427 మ్యాచ్‌లు ఆడిన మ్యాక్స్‌వెల్ 154 స్ట్రయిక్‌రేట్‌తో 28 సగటున 10,183 పరుగులు చేశాడు. ఇందులో ఏడు సెంచరీలు ఉన్నాయి. ఆసీస్ తరఫున 133 అంతర్జాతీయ టీ20లు ఆడిన మ్యాక్సీ ఐదు సెంచరీల సాయంతో 2664 పరుగులు చేశాడు. టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో మ్యాక్స్‌వెల్ 16వ స్థానంలో ఉన్నాడు.
చిత్తుగా ఓడిన సిక్సర్స్
157 పరుగుల సాధారణ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన సిడ్నీ సిక్సర్స్ నిర్ణీత ఓవర్లు పూర్తయ్యే సరికి లక్ష్యానికి 17 పరుగుల దూరంలో నిలిచిపోయింది. మార్క్ స్టీకిటీ (3/14), పీటర్ సిడిల్ (2/26), మార్కస్ స్టోయినిస్ (2/30), ఉసామా మిర్ (2/19) పొదుపుగా బౌలింగ్ చేయడంతో పాటు వికెట్లు తీసి మెల్‌బోర్న్ స్టార్స్‌ను గెలిపించారు. సిక్సర్స్ ఇన్నింగ్స్‌లో జేమ్స్ విన్స్ (53) ఒక్కడే అర్ద సెంచరీతో రాణించాడు. మిగిలిన ఆటగాళ్లంతా విఫలమయ్యారు. కర్టిస్ ప్యాటర్సన్ (18), హేడెన్ కెర్ (21), మోసెస్ హెన్రిక్స్ (13) రెండంకెల స్కోర్లు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment