సిడ్నీ: త్వరలో ఆస్ట్రేలియా ఆతిథ్యమివ్వనున్న ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్‌లో నాలుగో టెస్టులో ప్రేక్షకుల రికార్డు బద్దలయ్యే అవకాశముంది. మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్ లో బాక్సింగ్ డే రోజైన డిసెంబర్ 26న మొదలయ్యే ఈ టెస్టు తొలి రోజుకు అందుబాటులో ఉంచిన టిక్కెట్లన్నీ అమ్ముడుపోయాయి. ఈ స్టేడియం పూర్తి సామర్థ్యం సుమారు లక్ష. మొత్తం టిక్కెట్లన్నీ విక్రయించడంతో కొన్నవాళ్లంతా హాజరైతే సరికొత్త రికార్డు నమోదు కానుంది. 1961లో ఎంసీజీలో ఆసీస్, విండీస్‌ల మధ్య జరిగిన టెస్టును 90,800 మంది ప్రేక్షకులు చూశారు. ఇప్పటిదాకా ఇదే రికార్డు.
బాక్సింగ్ డే రోజు వందశాతం హాజరి నమోదైతే పాత రికార్డు చెరిగిపోనుందని క్రికెట్ ఆస్ట్రేలియా వర్గాలు తెలిపాయి. అయితే మిగతా నాలుగు రోజులకు సంబంధించిన టిక్కెట్లు ఇంకా అందుబాటులో ఉన్నాయని ఆ వర్గాలు తెలిపాయి. బ్రిస్బేన్‌లో ఈ నెల 21 నుంచి జరిగే తొలి టెస్టుతో యాషెస్ సిరీస్ మొదలవుతుంది.