సాక్షి, హైదరాబాద్: ఆలిండియా సీనియర్ ర్యాంకింగ్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) జట్టుకు ప్రాతినిధ్యం వహించిన హైదరాబాద్ ప్లేయర్స్ మేఘన జక్కంపూడి, మనీషా ఆకట్టుకున్నారు. విజయవాడలో జరిగిన ఈ టోర్నమెంట్‌లో తన భాగస్వామి ధ్రువ్ కపిలతో కలిసి మేఘన మిక్స్‌డ్ డబుల్స్ టైటిల్‌ను... రుతుపర్ణ (ఒడిశా)తో కలిసి మనీషా మహిళల డబుల్స్ టైటిల్స్‌ను హస్తగతం చేసుకున్నారు. ఆదివారం జరిగిన ఫైనల్లో టాప్ సీడ్ ధ్రువ్ కపిల (ఎయిరిండియా)–మేఘన (ఆర్‌బీఐ) ద్వయం 17–21, 22–20, 21–16తో శ్లోక్ రామచంద్రన్ (ఏఏఐ)–రుతుపర్ణ పాండా (ఒడిశా) జోడీపై గెలుపొందింది. మహిళల డబుల్స్ ఫైనల్లో మనీషా (ఆర్‌బీఐ)–రుతుపర్ణ (ఒడిశా) జంట 23–21, 21–10తో మూడో సీడ్ శిఖా గౌతమ్ (ఎయిరిండియా)–అశ్విని భట్ (కర్ణాటక) జోడీపై నెగ్గి విజేతగా నిలిచింది.
పురుషుల విభాగంలో తెలంగాణ ప్లేయర్ సిరిల్ వర్మకు నిరాశ ఎదురైంది. టోర్నీ ఆసాంతం అద్భుతంగా ఆడిన సిరిల్ వర్మ ఫైనల్లో బోల్తా పడ్డాడు. పురుషుల సింగిల్స్ టైటిల్ పోరులో ఎనిమిదో సీడ్ సిరిల్ వర్మ (తెలంగాణ) 9–21, 21–15, 11–21తో పన్నెండో సీడ్ కిరణ్ జార్జ్ (కేరళ) చేతిలో ఓడిపోయి రన్నరప్‌తో సరిపెట్టుకున్నాడు. మహిళల విభాగంలో మూడో సీడ్ ఆకర్షి కశ్యప్ చాంపియన్‌గా నిలిచింది. ఫైనల్లో ఆకర్షి కశ్యప్ (ఏఏఐ) 21–12, 21–16తో ఏడో సీడ్ అనురా ప్రభుదేశాయ్ (గోవా)పై గెలుపొందింది. పురుషుల డబుల్స్ విభాగంలో కృష్ణప్రసాద్ జంట టైటిల్‌ను కైవసం చేసుకుంది. తుదిపోరులో టాప్‌సీడ్ కృష్ణ ప్రసాద్ (ఆంధ్రప్రదేశ్)–ధ్రువ్ కపిల (ఎయిరిండియా) జంట 21–19, 21–16తో మూడోసీడ్ అర్జున్ (కేరళ)–శ్లోక్ రామచంద్రన్ (ఏఏఐ) జోడీపై గెలుపొందింది.
Comments
Please login to add a commentAdd a comment