ఆహా హార్దిక్‌ పాండ్యా | MI Beat KKR By 13 Runs At Home | Sakshi
Sakshi News home page

ఆహా హార్దిక్‌ పాండ్యా

Published Mon, May 7 2018 4:39 AM | Last Updated on Mon, May 7 2018 3:06 PM

MI Beat KKR By 13 Runs At Home - Sakshi

హార్దిక్‌ , సూర్యకుమార్‌

మొదట ముంబై భారీ స్కోరు చేసేలా కనిపించింది! కానీ కోల్‌కతా కట్టడి చేసి మ్యాచ్‌లోకి వచ్చింది. ఆ తర్వాత నైట్‌రైడర్స్‌ గెలిచేస్తుందేమో అనిపించింది. కానీ, ముంబై పుంజుకుని విజయాన్ని చేజిక్కించుకుంది. రెండు జట్లకూ సమాన అవకాశాలు వచ్చిన ఈ మ్యాచ్‌లో పరిస్థితులకు తగినట్లు ఆడలేక కోల్‌కతా ఓటమి పాలైంది.
 

ముంబై: ప్లే ఆఫ్‌ దిశగా ముంబై ఇండియన్స్‌కు వరుసగా రెండో గెలుపు. ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ హార్దిక్‌ పాండ్యా (20 బంతుల్లో 35; 4 ఫోర్లు, 1 సిక్స్, 2/19) ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో అదరగొట్టడంతో కోల్‌కతా నైట్‌రైడర్స్‌పై ఆ జట్టు 13 పరుగుల తేడాతో గెలుపొందింది. రెండు జట్ల మధ్య ఆదివారం ఇక్కడ జరిగిన మ్యాచ్‌లో టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ముంబై ఓపెనర్లు సూర్యకుమార్‌ యాదవ్‌ (39 బంతుల్లో 59; 7 ఫోర్లు, 2 సిక్స్‌లు), ఎవిన్‌ లూయీస్‌ (28 బంతుల్లో 43; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) ధనాధన్‌ బ్యాటింగ్‌తో 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది.

ఛేదనలో రాబిన్‌ ఉతప్ప (35 బంతుల్లో 54; 6 ఫోర్లు, 3 సిక్స్‌లు) దూకుడు, నితీశ్‌ రాణా (27 బంతుల్లో 31; 3 ఫోర్లు, 1 సిక్స్‌) రాణింపుతో సులువుగా గెలిచేలా కనిపించిన కోల్‌కతా... చివరి ఓవర్లలో రన్‌రేట్‌కు తగ్గట్లు పరుగులు చేయలేక 168/6కే పరిమితమైంది. కెప్టెన్‌ దినేశ్‌ కార్తీక్‌ (26 బంతుల్లో 36 నాటౌట్‌; 5 ఫోర్లు, 1 సిక్స్‌) చివరి వరకు క్రీజులో నిలిచినా ఫలితం లేకపోయింది. దీంతో ముంబై 13 పరుగులతో గెలుపొందింది.  

ముగ్గురు బాదారు...  
మొదటి రెండు ఓవర్లు ఆచితూచి ఆడిన ఓపెనర్లు సూర్య, లూయీస్‌లు మూడో ఓవర్‌ నుంచి జోరు పెంచారు. మిచెల్‌ జాన్సన్‌ వేసిన ఆ ఓవర్లో సూర్య రెండు ఫోర్లు, సిక్స్‌ సహా 15 పరుగులు బాదాడు. లూయీస్‌ కూడా ఊపందుకుని ఎడాపెడా సిక్స్‌లు, ఫోర్లు బాదడంతో రన్‌రేట్‌ అమాంతం పెరిగిపోయింది. 9.1 ఓవర్లకు 91/0 ఇదీ ఓ దశలో ముంబై స్కోరు. వీరిద్దరి ఆట చూస్తే జట్టు అవలీలగా 200 పరుగులు చేస్తుందనిపించింది. కానీ ఇక్కడి నుంచే కథ మారింది.

తొలుత లూయీస్‌ను ఎల్బీగా వెనక్కుపంపిన రసెల్‌ (2/12)... సీజన్‌లో నాలుగో అర్ధ శతకం (31 బంతుల్లో) అందుకున్న సూర్యనూ అవుట్‌ చేశాడు. ఈ మధ్యలో కెప్టెన్‌ రోహిత్‌ (11) నరైన్‌కు చిక్కాడు. ఐదు ఓవర్ల వ్యవధిలో వీరు పెవిలియన్‌ చేరడం, కోల్‌కతా బౌలర్లు కట్టడి చేయడంతో ఈ సమయంలో 36 పరుగులే వచ్చాయి. ఓ ఎండ్‌లో హార్దిక్‌ షాట్లు కొడుతున్నా... కృనాల్‌ పాండ్యా (14), డుమిని (13 నాటౌట్‌) వేగంగా ఆడలేకపోయారు. తొలి 10 ఓవర్లలో 95 పరుగులు చేసిన ముంబై... మిగతా 10 ఓవర్లలో 86 పరుగులు చేసింది. రోహిత్‌ శర్మ, కృనాల్‌ పాండ్యా, డుమినిలు 33 బంతులు ఆడి 38 పరుగులే చేయడంతో జట్టు తక్కువ స్కోరుతోనే సరిపెట్టుకుంది.

ముగించలేకపోయారు...
ఛేదించదగిన లక్ష్యంతో బరిలో దిగిన కోల్‌కతా క్రిస్‌ లిన్‌ (17)కు తోడుగా గత మ్యాచ్‌ హీరో శుబ్‌మన్‌ (7)ను ఓపెనింగ్‌కు దింపింది. వీరిద్దరూ క్రీజులో ఉండగా ఏడు బంతుల వ్యవధిలో ఆరు ఫోర్లు రావడంతో నైట్‌రైడర్స్‌కు శుభారంభం లభించినట్లే కనిపించింది. అయితే, బుమ్రా, మెక్లీనగన్‌ ఓవర్లలో రెండేసి బౌండరీలు బాదిన లిన్‌ వెంటనే అవుటయ్యాడు. మరుసటి ఓవర్లోనే హార్దిక్‌...శుబ్‌మన్‌ ఆటకట్టించాడు. ఈ స్థితిలో రాణా కొన్ని చక్కటి షాట్లు కొట్టినా... ఉతప్ప కుదురుకోవడానికి సమయం తీసుకున్నాడు. తర్వాత మార్కండే బౌలింగ్‌లో రెండు సిక్స్‌లతో వేగం పెంచాడు.

కటింగ్‌ బౌలింగ్‌లో వరుసగా నాలుగు ఫోర్లు కొట్టి ఈ సీజన్‌లో తొలి అర్ధశతకం (32 బంతుల్లో) అందుకున్నాడు. తదుపరి మార్కండే ఓవర్లో షాట్‌కు యత్నించి కటింగ్‌కే క్యాచ్‌ ఇచ్చాడు. దీంతో మూడో వికెట్‌కు 84 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. మరుసటి ఓవర్లోనే రాణా కూడా పెవిలియన్‌ చేరాడు. అప్పటికి విజయ లక్ష్యం 39 బంతుల్లో 67. కార్తీక్, రస్సెల్‌ (9) ఉండటంతో ఇదేమంత కష్టం కాదనిపించింది. కానీ వీరు తగినంత వేగంగా ఆడలేకపోయారు. 12 బంతుల్లో 37 పరుగులు అవసరం కా>గా, బుమ్రా వేసిన 19వ ఓవర్లో 14 పరుగులు వచ్చాయి. చివరి ఓవర్లో కార్తీక్, నరైన్‌ (5) గెలిపించలేకపోయారు.



స్కోరు వివరాలు

ముంబై ఇండియన్స్‌ ఇన్నింగ్స్‌: సూర్యకుమార్‌ (సి) కార్తీక్‌ (బి) రసెల్‌ 59; లూయీస్‌ (సి) లిన్‌ (బి) రసెల్‌ 43; రోహిత్‌ శర్మ (సి) సబ్‌–రింకూ సింగ్‌ (బి) నరైన్‌ 11; హార్దిక్‌ నాటౌట్‌ 35; కృనాల్‌ (సి) శుబ్‌మన్‌ గిల్‌ (బి) నరైన్‌ 14; డుమిని నాటౌట్‌ 13; ఎక్స్‌ట్రాలు 6; మొత్తం: (20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి ) 181.  

వికెట్ల పతనం: 1–91, 2–106, 3–127, 4–151.

బౌలింగ్‌: రాణా 2–0–17–0, ప్రసిద్ధ్‌ క్రిష్ణ 4–0–39–0, జాన్సన్‌ 3–0–25–0, నరైన్‌ 4–0–35–2, చావ్లా 3–0–35–0, కుల్దీప్‌ 2–0–17–0, రసెల్‌ 2–0–12–2.

కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ ఇన్నింగ్స్‌: క్రిస్‌ లిన్‌ (సి) బుమ్రా (బి) మెక్లీనగన్‌ 17; శుబ్‌మన్‌ గిల్‌ (సి) కృనాల్‌ (బి) హార్దిక్‌ 7; ఉతప్ప (సి) కటింగ్‌ (బి) మార్కండే 54; రాణా (సి) బుమ్రా (బి) హార్దిక్‌ 31; కార్తీక్‌ నాటౌట్‌ 36; రసెల్‌ (సి) కృనాల్‌ (బి) బుమ్రా 9; నరైన్‌ (సి) రోహిత్‌ (బి) కృనాల్‌ 5; చావ్లా నాటౌట్‌ 0; ఎక్స్‌ట్రాలు 9; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి) 168.

వికెట్ల పతనం: 1–28, 2–28, 3–112, 4–115, 5–131, 6–163.

బౌలింగ్‌: మెక్లీనగన్‌ 4–0–30–1, బుమ్రా 4–0–34–1, హార్దిక్‌ పాండ్యా 4–0–19–2, కృనాల్‌ 3–0–29–1, మార్కండే 3–0–25–1, కటింగ్‌ 2–0–23–0.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement